సిపిఎస్‌ రద్దు చేయాల్సిందే

  • అధ్యక్ష, కార్యదర్శులుగా వెంకటేశ్వర్లు, ప్రసాద్‌
  • యుటిఎఫ్‌ స్వర్ణోత్సవాల రాష్ట్ర మహాసభ డిమాండ్‌
  • బకాయిల కోసం ఫిబ్రవరి 17 నుంచి ఆందోళనలు

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : సిపిఎస్‌ను రద్దు చేయాలని, ప్రాథమిక పాఠశాల వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ యుటిఎఫ్‌ స్వర్ణోత్సవాల రాష్ట్ర మహాసభ తీర్మానించింది. కాకినాడ పిఆర్‌ ప్రభుత్వ కళాశాల ఆవరణలో నాలుగు రోజులపాటు జరిగిన ఈ మహాసభ బుధవారం ముగిసింది. యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన చివరిరోజు ప్రతినిధుల సభలో యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌.ప్రసాద్‌ మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిల కోసం యుటిఎఫ్‌ కార్యాచరణ తీసుకుందని తెలిపారు. ఫిబ్రవరి 17 నుంచి ఆందోళన కార్యక్రమాలు మొదలు పెడతామన్నారు. దీనికోసం ఫిబ్రవరి 2న విజయవాడలో సన్నాహక సదస్సు జరుగుతుందని తెలిపారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర, గోదావరి, ఉత్తర రాయలసీమ, దక్షిణ రాయలసీమల్లో సన్నాహక సమావేశాలను నిర్వహిస్తామన్నారు. అనంతరం మహాసభ పలు తీర్మానాలను ఆమోదించింది.

బకాయిల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : కాకినాడ ఎంపి ఉదయ్ శ్రీనివాస్‌

ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారానికి కృషి చేస్తానని కాకినాడ ఎంపి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ హామీ ఇచ్చారు. చివరి రోజు మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. టిడిపి కూటమి అధికారంలోకి రావడంలో ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉందన్నారు. కూటమి సర్కారు హయాంలో రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని వివరించారు. భవిష్యత్తులో యువతకు మంచి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లోనూ భారీ ఎత్తున పరిశ్రమలు రానున్నాయని తెలిపారు. కాకినాడ జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్‌ మాట్లాడుతూ సమస్యలను అధికారుల దృష్టికి నివేదిస్తూ విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేసే తత్వం యుటిఎఫ్‌ ప్రత్యేకత అని అన్నారు. నిబద్ధతతో పనిచేసే ఉపాధ్యాయ సంఘం యుటిఎఫ్‌ అని పేర్కొన్నారు. కాకినాడ పిఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ విబి.తిరుపాణ్యం మాట్లాడుతూ 140 సంవత్సరాల చరిత్ర కలిగిన రాష్ట్రంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ కళాశాల అయిన పిఆర్‌ కళాశాలలో యుటిఎఫ్‌ స్వర్ణోత్సవాల రాష్ట్ర మహాసభ జరుపుకోవడం హర్షణీయమన్నారు.

అధ్యక్షునిగా వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా ప్రసాద్‌

యుటిఎఫ్‌ రాష్ట్ర నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. సీనియర్‌ నాయకులు జి.ప్రభాకర్‌వర్మ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. యుటిఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా కె.శ్రీనివాసరావు, అధ్యక్షులుగా ఎన్‌.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా కెఎస్‌ఎస్‌.ప్రసాద్‌, ఉపాధ్యక్షులుగా కె.సురేష్‌కుమార్‌, ఎఎన్‌.కుసుమకుమారి, కోశాధికారిగా ఆర్‌.మోహన్‌రావు మరో 15 మంది రాష్ట్ర కార్యదర్శులతో నూతన కమిటీ ఎన్నికైంది. ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌గా టిఎస్‌ఎన్‌ఎల్‌.మల్లేశ్వరరావు, ఐక్య ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకులుగా కె.సురేష్‌ కుమార్‌, ప్రచురణల కమిటీ చైర్మన్‌గా ఎం.హనుమంతరావు, కుటుంబ సంక్షేమ పథకం అధ్యక్షులుగా కె.శ్రీనివాసరావు, అధ్యయన కమిటీ అధ్యక్షులుగా పి.బాబురెడ్డి ఎన్నికయ్యారు.

పలు తీర్మానాలు ఆమోదం

యుటిఎఫ్‌ 17వ రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక స్వర్ణోత్సవ మహాసభ పలు తీర్మానాలను ఆమోదించింది. సిపిఎస్‌ను, 117 జిఒను రద్దు చేయాలని, ప్రాథమిక పాఠశాల వ్యవస్థ (1 నుంచి 5 తరగతులు)ను పునరుద్ధరించాలని, హైస్కూళ్లలో తెలుగు, ఇంగ్లీష్‌ మీడియంలు కొనసాగించాలని, ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని, ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు, కల్పించాలని, 12వ నూతన వేతన సవరణ సంఘం నియమించాలని, ఐఆర్‌ వెంటనే చెల్లించాలని తదితర తీర్మానాలను ఆమోదించారు. ఖాళీ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, యాప్‌ల భారం తగ్గించాలని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, నూతన విద్యా విధానం రద్దు చేయాలని, కామన్‌ సర్వీస్‌ రూల్స్‌ అమలు చేయాలని, జూనియర్‌ లెక్చరర్లకు ఉద్యోగోన్నతులు కల్పించాలని, మున్సిపల్‌ టీచర్ల, ట్రైబల్‌ వెల్ఫేర్‌ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని, ప్రతి తరగతికీ ఒక ఉపాధ్యాయుడు ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ తీర్మానించారు.

➡️