ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి
ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం నిర్వహిస్తున్న భవిత కేంద్రాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పుట్టుకతో వివిధ సమస్యలతో పుట్టిన చిన్నారులకు పూర్తి స్థాయిలో వీటి సేవలు సక్రమంగా అండడం లేదు. విద్యా బుద్ధులతోపాటు పిల్లల్ని మానసికంగా సరిదిద్దేందుకు వీటిని ఏర్పాటు చేసినా పేద వర్గాలకు చెందిన ప్రత్యేక అవసరాల గల పిల్లలకు అక్కరకు రాకుండా పోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వమిస్తున్న రవాణా, ఇతర అలవెన్స్ సొమ్ములు సరిపడక పేద, సామాన్య తల్లిదండ్రులపై అదనపు భారం పడుతోంది. మరోవైపు ఫిజియోథెరఫీ సేవలు అరకొరగానే అందుతున్నాయి.సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో 64 భవిత కేంద్రాలు పని చేస్తున్నాయి. వీటిల్లో సుమారు 1300 మంది ప్రత్యేక అవసరాల గల పిల్లలు, 950 మంది ఫిజియోథేరఫీ చికిత్స పొందుతున్న చిన్నారులు ఉన్నారు. వినికిడి లోపం, నరాల బలహీనత, దృష్టిలోపం, అభ్యసన వైకల్యం, బుద్ధి మాంధ్యంతోపాటు 21 రకాల వైకల్యంతో బాధపడే 18 సంవత్సరాలలోపు పిల్లలను గుర్తించి వీటి ద్వారా శిక్షణ ఇస్తున్నారు. శ్రీ అరకొరగానే అలవెన్స్‌లు గత ప్రభుత్వ హయాంలో నాడు – నేడు పేరుతో రూ.వందల కోట్లు నిధులను ఖర్చుచేసినా భవిత కేంద్రాల నిర్వహణకు మాత్రం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. వివిధ లోపల గల పిల్లల్ని ఆయా కేంద్రాలకు తీసుకుని రావడానికి తల్లితండ్రులు అనేక వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. వీరంతా పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన సామాన్య ప్రజానీకం కావడంతో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏడాదికి రూ.3 వేలు రవాణా భత్యం, ఎస్కార్ట్ అలవెన్స్, ఇతర ప్రత్యేక భత్యాలను ఇస్తున్నారు. వాస్తవానికి పిల్లల్ని కేంద్రాలకు తీసుకుని రావడానికి 6 కిలోమీటర్ల పరిధిలో నెలకు కనీసంగా రూ.1600 నుంచి 2 వేలు ఖర్చవతోంది. అంటే సంవత్సరంలో 10 నెలలపాటు కేంద్రాలకు తీసుకొస్తే రూ.16 వేలు నుంచి రూ.20 వేలు రవాణా ఛార్జీల రూపంలో ఖర్చు అవుతోంది. ఇచ్చే అరకొర ఆర్థిక సాయం సరిపోని పరిస్థితుల్లో పిల్లలను కేంద్రాలకు తీసుకురావడానికి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. శ్రీ సిబ్బంది ఇబ్బందులునరాల బలహీనతతో ఇబ్బందులు పడుతున్న పిల్లలకు ప్రతి సోమవారం 13 మంది ఫిజియోథెరఫీ వైద్యుల ఆధ్వర్యంలో వైద్య సహాయం అందిస్తున్నారు. ఒక్కొక్కరూ 2 నుంచి 3 మండలాలు తిరిగి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడంతో ఉన్నవారిపైన భారం పెరుగుతుంది. దీంతో భవిత కేంద్రాల్లో ఫిజియోథెరపీ సేవలు నామమాత్రంగానే అందుతున్నాయి. తీవ్ర, అతి తీవ్ర బుద్ధి మాంద్యం గల పిల్లలకు ప్రతి శనివారం వారి వారి ఇళ్ల వద్దకు వెళ్లి విద్యా శిక్షణ అందించాల్సి వస్తుంది. ఎస్‌ఎస్‌సిలో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ రెండు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకునే పరిస్థితిలోకి వెళ్లారు.శ్రీ నిలిచిన మెయింటెనెన్స్ గ్రాంట్‌గతంలో ఒక్కో కేంద్రానికి ఏడాదికి రూ.10 వేలు మెయింటెన్స్ గ్రాంటు (నిర్వహణ ఖర్చులు) ఇచ్చేవారు. గత నాలుగేళ్లుగా నిలిచిపోవడంతో సిబ్బంది సొంత ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తోంది. కరెంట్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తున్నా కేంద్రాలను తరచూ శుభ్రం చేయడానికి చీపుర్లు, పినాయిల్, మాస్కులు కొనుగోలు, ఫ్యాన్లు మరమ్మతులు చేసుకునేందుకు కొందరు ఇచ్చే అరకొర జీతాల నుంచే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో భవిత కేంద్రాలపై పూర్తిస్థాయి దృష్టి పెట్టి సామాన్య తల్లిదండ్రులకు అలవెన్స్‌లను పెంచి ఇవ్వాలని, అలాగే కేంద్రాల నిర్వహణకు నిధులను కేటాయించాలని, ఇతర సౌకర్యాలను కల్పించాలని కోరుతున్నారు.