క్రీడలకు ఏదీ ప్రోత్సాహం..?

Apr 11,2025 22:59
నిధులు విడుదల చేయడం లేదు.

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

వేసవి క్రీడా శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం ఒక్క పైసా కూడా నిధులు విడుదల చేయడం లేదు. గత వైసిపి పాలనలో క్రీడలను కనీసంగా ప్రోత్సాహం లేకుండా పోయింది. కూటమి సర్కారు అయినా క్రీడలపై దృష్టిని సారించి ప్రోత్సాహం ఇవ్వాలని కోచ్‌లు, క్రీడాకారులు కోరుతున్నారు. పేద విద్యార్థులు క్రీడలకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.జిల్లా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నారు. మే 1 నుంచి 30వ తేదీ వరకు జరిగే ఈ శిబిరాల్లో ఐదు నుంచి 15 ఏళ్ల బాలురుకు వాలీబాల్‌, అథ్లెటిక్స్‌, బాక్సింగ్‌, బాస్కెట్‌బాల్‌, క్రికెట్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌, స్కేటింగ్‌, స్విమ్మింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, టెన్నిస్‌, బాలికలకు బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌, బాస్కెట్‌బాల్‌, బాక్సింగ్‌, అథ్లెటిక్స్‌, స్కేటింగ్‌, స్విమ్మింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాంశాలలో శిక్షణ ఇస్తారు. క్రీడా విభాగం సిబ్బందితో ప్రతి రోజూ ఉదయం 6 నుంచి 8.30 వరకూ, సాయంత్రం 4 నుంచి 7.30 వరకూ 6 నుంచి 16 సంవత్సరాలలోపు పిల్లలకు శిక్షణ ఉంటుంది. ఇలా వివిధ క్రీడల్లో శిక్షణ ఇస్తూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీస్తున్నారు. గత 20 ఏళ్లుగా కాకినాడ డిస్ట్రిక్‌ స్పోర్ట్స్‌ ఆథారిటీ (డిఎస్‌ఎ) క్రీడా మైదానంలో ఏటా వేసవిలో శిక్షణ తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను వివిధ క్రీడల్లో తీర్చి దిద్దుతున్నారు. గతేడాది నిర్వహించిన వివిధ శిబిరాల్లో సుమారు 2000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.నిధులు విడుదల చేయని ప్రభుత్వంవేసవి క్రీడా శిబిరాలకు ప్రభుత్వం గత ఐదేళ్ల నుంచి నిధులు విడుదల చేయడం లేదు. జిల్లా కలెక్టర్‌ చొరవ తీసుకుంటున్న నేపథ్యంలో అరకొర సొమ్ములే వస్తున్నాయి. అవి ఏ మూలకూ సరిపోని పరిస్థితి. ఏటా శిక్షణ శిబిరాలపై అధికారులు ప్రకటనలు ఇస్తున్నారు తప్ప ఆచరణలో సౌకర్యాలు కల్పించలేకపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాతలు, కొంతమంది క్రీడాకారులు, కోచ్‌ల సొంత సొమ్ములు వెచ్చిస్తున్న నేపథ్యంలో శిక్షణ శిబిరాలు జరుగుతున్నాయి. ఏటా 100 శిబిరాలను నిర్వహించాలని అధికారులు లక్ష్యంగా తీసుకుంటున్నారు. కానీ 50 మాత్రమే నిర్వహిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో క్రీడాకారులు కూడా ఆసక్తిని కనబరచకపోతున్నారు. జిల్లాకు ఈ ఏడాది ప్రత్యేకంగా 50 శిక్షణ శిబిరాలు నిర్వహించాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కార్యాచరణను సిద్ధం చేశారు. రూ.300 నుంచి రూ.500 వరకు రిజిస్ట్రేషన్‌ ఫీజును వసూలు చేస్తారు. క్రీడా సంఘాలు పిఇడిలు, పిఇటిలు, సీనియర్‌ క్రీడాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. అయితే ఈ శిబిరాల్లో పాల్గొనేందుకు కొందరు వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడం, సరైన ఏర్పాట్లు చేయకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఆట వస్తువులు, కోచ్‌లకు పారితోషికాలు, తాగునీరు, ఉదయం, సాయంత్రం అల్పాహారం వంటివి కూడా ఇవ్వడం లేదు. క్రీడాకారులే ఇవన్నీ సమకూర్చుకోవాల్సి వస్తుంది. వాస్తవానికి శిక్షణ శిబిరాల వద్ద మంచినీరు, క్రీడా పరికరాలు వంటి ఏర్పాట్లు చేయాల్సి ఉంది. గతంలో ఒక శిబిరం నిర్వహిస్తే కోచ్‌కు ప్రోత్సాహకంగా రూ.2 వేలు పారితోషికం ఇచ్చేవారు. ఆట వస్తువులకు రూ.7 వేలు, గ్రౌండ్‌ నిర్వహణకు రూ.1000 ఇచ్చేవారు. అయితే గత ఇదేళ్లుగా వీటిని నిలిపివేశారు.

➡️