‘అందరి అభిమానమే పవన్‌కు విజయం’

May 15,2024 22:22
ప్రజలందరీ ప్రేమాభిమానాలే

ప్రజాశక్తి – పిఠాపురం

ప్రజలందరీ ప్రేమాభిమానాలే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు విజయాన్ని అందిస్తాయని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. బుధవారం గొల్లప్రోలు పట్టణంలో సత్య కృష్ణ ఫంక్షన్‌ హాల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కృతజ్ఞత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసైనికులు వేసుకున్న ఎర్ర తువ్వాలను చూసి వైసిపి వాళ్లు ఎందుకంత హడావుడి చేశారో అర్థం కాలేదన్నారు. ఎలక్షన్‌ జరుగుతున్న సమయంలో తనకు ఫోన్‌లో మీ పార్టీ కార్యకర్తలు కండువాలు వేసుకుంటున్నారని చెప్పడంతో కండువాలు తొలగించాలని ఎన్నికల నిబంధనలు పాటించాలని జనసైనికులకు తెలిపారన్నారు. తీరా చూస్తే వారు ధరించింది పార్టీ కండువాలు కాదని ఎర్ర తువ్వాలు అని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి జనసైనికులు చాలా నిబద్దతగా కష్టపడి నిజాయితీగా పని చేశారన్నారు. మీ అందరి అభిమానం, ప్రేమ పవన్‌ కళ్యాణ్‌ని గెలిపిస్తాయన్నారు. జనసైనికులు, వీర మహిళలు, నాయకులు ప్రత్యర్థి పార్టీ వారిపై ఎటువంటి ధూషానలకు దిగవద్దన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు హరిప్రసాద్‌, నాయకులు మర్రెడ్డి శ్రీనివాసరావు, పంచకర్ల సందీప్‌, అజరు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️