పిఠాపురం కోట దక్కేది ఎవరికో..?

May 14,2024 23:25
పిఠాపురం నియోజకవర్గ

ప్రజాశక్తి – యు.కొత్తపల్లి

పిఠాపురం నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అందరూ చూపు పిఠాపురం అసెంబ్లీపై ఉంది. పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు కొణిదల పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేయడంతో అందరి చూపు పిఠాపురంపైనే ఉంది. 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో పోటీచేసి అత్యల్ప మెజార్టీతో పవన్‌ కళ్యాణ్‌ ఓటమి చెందారు. 2024 ఎన్నికల్లో అధికార వైసిపిని గద్దెదించేందుకు టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి ఏర్పాటులో పవన్‌ కళ్యాణ్‌ కీలకపాత్ర పోషించారు. వై నాట్‌ 175 అంటూ అధికార వైసిపి ఎన్నికల ముందు పెద్దఎత్తున ప్రచారం చేసింది. అందుకు అనుగుణంగా కార్యచరణతో అడుగులు వేస్తూ దూకుడును ప్రదర్శించింది. ఈ నేపథ్యంలోనే వైసిపి దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు పవన్‌ కళ్యాణ్‌ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని ప్రకటించారు. అందుకు అనుగుణంగా టిడిపి, బిజెపికి మధ్య స్నేహహస్తాన్ని ఇచ్చి కూటమిగా ఏర్పడటంలో కీలకపాత్ర పోషించారు. ఉమ్మడిగానే ఎన్నికల బరిలో నిలిచారు. గెలుపే లక్ష్యంగా కూటమి అభ్యర్థిగా పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. పవన్‌ కళ్యాణ్‌ను ఈ ఎన్నికల్లోనూ ఓడించేందుకు వైసిపి పెద్దఎత్తున ఎత్తుగడలు వేసింది. సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ పెండెం దొరబాబును కాదని, కాకినాడ ఎంపీ వంగా గీతను పవన్‌ కళ్యాణ్‌పై పోటీకి దించింది. దీంతోపాటు ఈ నియోజకవర్గం బాధ్యతలను ఎంపీ పెద్దిరెడ్డి మిథిన్‌ రెడ్డికి అప్పగించింది. ఆయనకుతోడు మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డిలను మండలాల వారీగా ఇన్‌ఛార్జులుగా నియమించింది. వీరికితోడు కాపు ఉద్యమనాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సైతం పవన్‌ కళ్యాణ్‌ ఓటమికి కృషి చేశారు. పిఠాపురం నుంచి బరిలో నిలిచిన వంగా గీత, పవన్‌ కళ్యాణ్‌ పక్షాన పోటాపోటీగా ప్రచారం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం ఆఖరిరోజున భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ విజయం కోసం వెండి, బుల్లి తెరకు చెందిన సిని హీరోలు, హాస్యనటులతోపాటు, పవన్‌ సోదురుడు నాగబాబు పిఠాపురం కేంద్రంగానే ఉండి ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారం ఒక ఎత్తేయితే ఓటర్లకు ప్రలోభాలకు గురిచేయడంలో ఇరు పార్టీలు పోటాపోటీగానే తలపడ్డాయి. అయితే వైసిపి ఓటర్లకు అందించిన నగదు పంపిణీలో వ్యత్యాసం చూపడంతో అబాసపాలైయింది. ఓటుకు నోటు అందని మహిళలు వైసిపి కార్యాలయానికి వచ్చి ధర్నాలకు దిగిన పరిస్థితి నెలకుంది. పోలింగ్‌ రోజున బూత్‌ల పరిశీలకు వచ్చిన వైసిపి అభ్యర్థి వంగా గీత మహిళా ఓటర్ల నుంచి నిరసనను ఎదుర్కొన్నారు. డబ్బు పంపిణీ వంగా గీతకు అడ్డుగీతగా మారిందనేది ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. వైసిపికి దక్కాల్సిన ఓట్లు సైతం ఈ నిర్వాకం వల్ల జనసేన పార్టీకి వెళ్లాయనే ప్రచారం లేకపోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో వంగా గీత గెలుపు తధ్యమని ఆ పార్టీ నాయకులు సైతం ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ 60 వేల నుంచి 70 వేల ఆధిక్యతతో విజయం సాధిస్తారని జనసేన పార్టీ నాయకులు ఢంకాపథంగా చెబుతున్నారు. అయితే పిఠాపురం కోటను ఎవ్వరు దక్కించకుంటారనే ఉత్కంఠ మాత్రం ప్రజల్లో నెలకుంది. దీంతో పిఠాపురం సీటుపై ప్రజలలో ఉత్కంఠ నెలకొంది

➡️