ప్రజాశక్తి – కాజులూరు
సమాజం కోసమే కవిత్వం నిలవాలని సుప్రసిద్ధ కవి మధునాపంతుల సత్యనారాయణ మూర్తి అన్నారు. ఆదివారం కవి మధునాపంతుల సత్యనారాయణ మూర్తి కేంద్ర సాహిత్య అకాడమీ, ఆంధ్రీకుటీరం సంయుక్త నిర్వహణలో పల్లిపాలెం గ్రామంలోని కామరాజు కళాక్షేత్రంలో కవితా పఠనం జరిగింది. సత్యనారాయణ మూర్తి ప్రేక్షకులతో తెలుగు కవిత్వం తీరు తెన్నులు, స్వీయ కవిత్వం, తనకు ప్రేరణ ఇచ్చిన అంశాలు తదితరాలపై మాట్లాడారు. కవి సామాజిక బాధ్యతతో కవితా ప్రక్రియకు వన్నె తేవాలన్నారు. యువతరం కవులు, రచయితలు తమ పూర్వకవుల సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని, తద్వారా మంచి సాహిత్యాన్ని సృష్టించగలరని తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సాహిత్య అకాడమీ సలహా మండలి సభ్యుడు చింతకింది శ్రీనివాసరావు సమన్వయకర్తగా వ్యవహరిం చారు. ఈ కార్యక్రమంలో రచయితలు దాట్ల దేవదానం రాజు, అవధానుల మణిబాబు సహా కవులు, కథకులూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సభకు ఆంధ్రీ కుటీరం కార్యదర్శి ఎంవి.చలపతి స్వాగతం పలికారు.