పోలింగ్‌ ప్రశాంతం

May 13,2024 23:12
పోలింగ్‌ ప్రశాంతం

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ సోమవారం చెదురుమొదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. మూడు జిల్లాలవ్యాప్తంగా సాయంత్రం 6 గంటల వరకూ కాకినాడ జిల్లాలో 73.33 శాతం, కోనసీమలో 81.92 శాతం, తూర్పు గోదావరి జిల్లాలో 62.89 శాతం పోలింగ్‌ జరిగినట్లు జిల్లా కలెక్టర్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 21 నియోజకవర్గాల్లో మొత్తం 4,858 పోలింగ్‌ స్టేషన్లు ఉండగా పలు కేంద్రాల్లో రాత్రి 9 గంటల వరకూ కూడా ఓటింగ్‌ కొనసాగింది. జిల్లావ్యాప్తంగా అనేక చోట్ల ఇవిఎంలు మొరాయించడంతో గంటల తరబడి పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. కాకినాడ రూరల్‌ కరప, పిఠాపురం, సామర్లకోట, తుని, కాకినాడ సిటీ తదితర ప్రాంతాల్లో ఇవిఎంలు మొరాయించిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. తొలుత ఉదయం 5 గంటల తర్వాత మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. అభ్యర్థులు, ఏజెంట్లు, అధికారుల సమక్షంలో ఈ ప్రక్రియ నిర్వహించిన అనంతరం ప్రతి ఇవిఎంలోనూ 50 ఓట్లను ఏజెంట్లు, అధికారుల సమక్షంలో ప్రిసైడింగ్‌ అధికారులు లెక్కించారు. అనంతరం ఆ ఓట్లు తొలగించి యంత్రాలకు సీల్‌ వేశారు. కొన్నిచోట్ల సాంకేతిక లోపాలు తలెత్తగా అప్పటికప్పుడు అధికారులు వాటిని సరి చేశారు.పోలింగ్‌ కొనసాగిందిలా…కాకినాడ జిల్లాలో మొత్తం 16,34,122 మంది ఓటర్లుండగా సాయంత్రం 6 గంటల వరకూ 11,21,191 మంది తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. 68.61 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. ఉదయం 9 గంటలకు 1,43,515 మంది ఓటు వేయగా 8.78 శాతం, 11 గంటలకు 38,68,95 మంది ఓటు వేయగా 23.68 శాతం, మధ్నాహ్నం 1 గంట వరకూ 38.89 శాతం, 3 గంటకు 87,5,908 మంది వేయగా 53.60 శాతం, సాయంత్రం 5 గంటలకు 10,36,438 మంది వేయగా 63.42 శాతం, 6 గంటలకు 11982,364 మంది వేయగా 73.33 శాతం నమోదయ్యిందనిఅధికారులు తెలిపారు. ఆలస్యంగా పోలింగ్‌సామర్లకోట మున్సిపాలిటీ బ్రౌన్‌ పేట 132 పిఎస్‌లో ఎంపీ అభ్యర్థి ఇవిఎం సెట్టింగ్‌లో ఇబ్బంది ఏర్పడటంతో 15 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. కాకినాడ రూరల్‌ తూరంగి 184 పోలింగ్‌ స్టేషన్‌లో ఇవిఎం మొరాయించడంతో అరగంట వరకూ పోలింగ్‌ మొదలు కాలేదు. కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం లొల్ల జెడ్‌పిహెచ్‌ఎస్‌ పాఠశాలలో 37వ పోలింగ్‌ బూత్‌లో అసెంబ్లీ నియోజకవర్గం ఇవిఎం సాంకేతిక లోపంతో మొరాయించడంతో కొంత సేపు ఓటింగ్‌ ప్రక్రియ నిలిచింది. అనంతరం టెక్నీషియన్‌ రావడంతో సమస్య పరిష్కారం అయ్యింది. సామర్లకోట పట్టణ పరిధి బొడ్డు భాస్కర రామారావు పాఠశాల 160 నెంబర్‌ పోలింగ్‌ బూత్‌లో ఇవిఎం మొరాయించడంతో 40 నిముషాల పాటు పోలింగ్‌ నిలిచింది. దీంతో ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మండపేట మండలం ఏడిద సీతానగరంలో ఓటింగ్‌ మిషన్‌లు మొరాయించాయి. దీంతో పోలింగ్‌లో జాప్యం జరిగింది. కరప మండలం అరట్లకట్టలో 210 పోలింగ్‌ స్టేషన్లో ఇవిఎం మొరాయించడంతో ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తాగునీటి సదుపాయం కూడా లేని కాకినాడ స్మార్ట్‌ సిటీలో గాంధీనగర్‌ మున్సిపల్‌ స్కూల్లో 57వ పోలింగ్‌ బూత్‌లో సౌకర్యాలు లేక ఓటర్లు కొంతసేపు ఆందోళన చేసారు.బారులు తీరిన ఓటర్లుఎండాకాలం కావడంతో ఉదయం 6 నుంచే పలు కేంద్రాలకు ఓటర్లు చేరుకున్నారు. ఓటు వేసే ప్రక్రియ ఆలస్యం కావడంతో మెజారిటీ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరడం కనిపించింది. మరోవైపు ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి సైతం స్వగ్రామాలకు ఓటర్లు తరలివచ్చారు. ఓటు హక్కుపై అవగాహన బాగా పెరగడంతో ఓటింగ్‌ శాతం కూడా ఈసారి గణనీయంగా పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉండడంతో ఎన్నికల అధికారులు క్యూ లైన్లలో నిలుచున్న ఓటర్లకు ఓటు వేసుకునే అవకాశం కల్పించారు. దీంతో రాత్రి 9 గంటల వరకు కూడా కొన్ని కేంద్రాల్లో పోలింగ్‌ జరిగింది. కాకినాడ దుమ్ములపేట, రేచర్లపేట 42, 48, 49, 50, 51 పోలింగ్‌ బూత్‌లలో పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు.ముఖ్య నేతలు ఓటు హక్కుకాకినాడ జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి, వైసిపి నేత ముద్రగడ పద్మనాభం కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాకినాడలో మాజీ కేంద్ర సహాయ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ కాకినాడ పార్లమెంట్‌ అభ్యర్థి ఎంఎం పళ్లంరాజు ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి కాకినాడ సిటీ ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి ఓటు వేశారు. కాకినాడ ఘాటీ సెంటర్‌ వద్ద ఉన్న 208 పోలింగ్‌ బూత్‌ వద్ద టిడిపి కాకినాడ సిటీ అభ్యర్థి వనమాడి కొండబాబు ఓటు వేసారు. జనసేన పార్టీ కాకినాడ పార్లమెంట్‌ అభ్యర్థి ఉదరు శ్రీనివాస్‌ పిఠాపురం కుమ్మరివీధిలో ఉన్న 2వ సచివాలయంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలోని నగరపాలక సంస్థ బాలికల ఉన్నత పాఠశాల శ్రీనగర్‌ 23వ పోలింగ్‌ బూత్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జె.నివాస్‌ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.చెదురు మొదురు ఘటనలుకాకినాడ సిటీ ఆనందభారతి రామకృష్ణారావుపేట వద్ద వైసిపి, టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వైసిపి మాజీ కార్పొరేటర్‌ సత్యకు గాయాలైనట్లు నాయకులు తెలిపారు. రామకృష్ణారావుపేటలో ఇరు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తల మధ్య జరిగిన వివాదం కాస్తా గొడవకు దారి తీసినట్లు తెలుస్తోంది. పిఠాపురంలో స్థానిక ఆర్‌ఆర్‌ బి హెచ్‌ఆర్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో జనసేన కార్యకర్త కండువా వేసుకుని ప్రచారం చేస్తుండగా అదే సమయంలో అక్కడికి చేరుకున్న వైసిపి అభ్యర్థి వంగా గీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యథేచ్ఛగా ఎన్నికల నిబంధనలను పక్కనపెట్టి జనసేన కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారని ఆమె ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. కిర్లంపూడి మండలం పాత కృష్టవరం పోలింగ్‌ బూత్‌ వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో వివాదం రేగింది. పోలింగ్‌ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు పీకివేశారు. కొన్ని కుర్చీలు విరగగా, రెండు వర్గాల్లో కొంతమందికి స్వల్పంగా గాయాలు అయ్యాయి. అనంతరం పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టారు. ఇవిఎంలు చీకట్లో ఉన్నాయంటూ పిఠాపురం జగ్గయ్య చెరువు బాదం మాధవరావు పాఠశాల పోలింగ్‌ బూత్‌ వద్ద ప్లకార్డులతో కొంతమంది నిరసన తెలిపారు. కాకినాడ సిటీ 6వ డివిజన్లో ఓటు వేయడానికి వచ్చిన వృద్ధురాలు మతి చెందింది. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ హైస్కూల్లోకి మాజీ ఎంఎల్‌ఎ వర్మ రావడంతో స్థానిక మత్స్యకారులు వ్యతిరేకించారు. కాకినాడ దుమ్ములపేటలో ఓట్ల కోసం తొక్కిసలాటలో వద్ధురాలు అస్వస్థతకు గురైంది.

➡️