కోడిపందేల బరులు ధ్వంసం

Jan 11,2025 23:11
వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన

ప్రజాశక్తి – కాజులూరు, కరప, యు.కొత్తపల్లి, పిఠాపురం

కోడి పందేల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన బరులను వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారుల బృందం ధ్వంసం చేసింది. సంక్రాంతిని పురస్కరించుకుని మండలంలోని పలు ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహించేందుకు పలువురు పందేల బరులను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే శనివారం తహశీల్దార్‌ ఠాగూర్‌, ఎంపిడిఒ రాంబాబు, పశువైద్యాధికారి చింతా శ్రీనివాస్‌, గొల్లపాలెం ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ సంయుక్తంగా దాడులు నిర్వహించారు. గుర్తించిన బరులను ధ్వంసం చేయించారు. ధ్వంసం చేసిన బరుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాల్లో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే కరప మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కోడిపందేల బరులను ట్రాక్టర్‌తో అధికారులు దున్నించారు. తాహశీల్దార్‌ ఎన్‌.సత్యనారాయణ, ఎస్‌ఐ టి.సునీత, స్థానిక అధికారులతో కలిసి కరప, గొర్రిపూడి, గురజానపల్లి, కొంగోడు, విజయ రాయుడుపాలెం తదిత గ్రామాల్లో పర్యటించి పందెం బరులను ధ్వంసం చేసి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. పేకాట, కోడిపందేలు, గుండాట వంటి అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ టి.సునీత హెచ్చరిం చారు. యు.కొత్తపల్లి మండలంలోని వాకతిప్ప గ్రామంలో కోడి పందేలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్న స్థలానికి వేసిన ఫినిషింగ్‌ను పోలీసులు తొలగించారు. జూదాలు నిర్వహించ కుండా బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్‌ఐ వెంకటేష్‌ తెలిపారు. అలాగే పిఠాపురంలో కోడి పందాలు, గుండాటలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన టెంట్లు, శామియానాలను ఎస్‌ఐ గుణశేఖర్‌ తన సిబ్బందితో కలిసి ధ్వంసం చేశారు.

➡️