సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు సిద్ధం

Apr 16,2025 22:47
శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

ప్రజాశక్తి – పెద్దాపురం

ఉపాధి హామీ చట్టంలో ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు సిద్ధమని సంఘ జిల్లా అధ్యక్షుడు కడమటి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. బుధవారం ఫీల్డ్‌ అసిస్టెంట్ల సంక్షేమ సంఘం నాయకులు ఇన్‌ఛార్జ్‌ ఎంపిడిఒ ఎం.సత్యనారాయణమూర్తికి వినతి పత్రం అంద జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీల్డ్‌ అసిస్టెంట్లు అందర్నీ పంచాయతీ ఉద్యోగులుగా గుర్తించాలని, 10 సంవత్సరాల సర్వీస్‌ కలిగిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను క్రమబద్ధీకరించాలని, మండలం యూనిట్‌గా తీసుకుని అంతర్గత బదిలీలు చేయాలని, పూర్తి స్తాయిలో హెచ్‌ఆర్‌ పాలసీతో హెల్త్‌ కార్డులు, ప్రమాద బీమా, గ్రాడ్యుటీ వంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, విధి నిర్వహణలో మరణించిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కుటుంబ సభ్యులకు ఉపాధి అవకాశం కల్పించాలని, పరిహారంగా రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 2016 నుంచి ఫీల్డ్‌ అసిస్టెంట్లకు వేతనాలు పెంచలేదని వెంటనే వేతనాలు పెంచాలని, విద్యార్హతలు ఆధారంగా ఫీల్డ్‌ అసిస్టెంట్లను కంప్యూటర్‌ ఆపరేటర్లుగా, టెక్నికల్‌ అసిస్టెంట్లుగా నియమించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం నుంచి నల్ల రిబ్బన్‌లు ధరించి విధులకు హాజరవుతున్నామన్నారు. ఈనెల 21న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పెన్‌ డౌన్‌ కార్యక్రమంలో భాగంగా విధులకు వెళ్లకుండా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తామన్నారు. సమస్య లు పరిష్కరించకపోతే ఈనెల 28 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షులు ఇనుకొండ శ్రీనివాస రావు, కార్యదర్శి తలారి ప్రశాంతి, కోశాధికారి అరసాడ ముసలబ్బాయి, నాయకులు ఎన్‌పిఎస్‌.చంద్రశేఖర రావు, కె.వీరబాబు, జి.వీర్రాజు, కె.ఆదినారాయణ పాల్గొన్నారు.

➡️