ప్రయివేటు ఫీ’జులుం’

May 15,2024 22:17
జిఒ నెంబరు 53 ప్రకారం 1

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి

జిఒ నెంబరు 53 ప్రకారం 1 నుంచి 10 తరగతి వరకూ చదువుతున్న పిల్లలకు రూరల్‌ ఏరియాలో రూ.10 వేలు, పట్టణాల్లో 15 వేలు, నగరాల్లో 20 వేలు ఫీజులు వసూలు చేయాలని గతేడాది ప్రభుత్వం చెప్పింది. అయితే ప్రయివేటు యాజమాన్యాలు కోర్టుని ఆశ్రయించి సంబంధిత జిఒను రద్దు చేయించాయి. దీంతో తమ ఇష్టారాజ్యంగా ఫీజులతో బాటు బస్సు ఛార్జీలు, పుస్తకాలు ఇలా రకరకాలుగా ఏడాదికి రూ. వేలల్లో, కొన్ని స్కూళ్లలో లక్షల్లో వసూలు చేసుకుని జేబులు నింపుకొంటున్నాయి. అయినా విద్యా శాఖ అధికారులు మాత్రం తమకు ఏమీ సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తుండడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే నెల 12 నుంచి పాఠశాలన్నీ పున:ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అధిక ఫీజుల వసూళ్లకు ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఈ ఏడాది కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే పలు సంస్థలు అడ్మిషన్లు వేటలో నిమగమయ్యాయి. అడ్డు అదుపు లేకుండా అధిక మొత్తంలో కలెక్షన్లు చేస్తున్నాయి. ఏటా ఇదే తంతు కొనసాగిస్తున్నా పట్టించుకోని అధికారుల తీరుపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు 1800 వరకూ ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలలున్నాయి. వీటిల్లో దాదాపు 3.50 లక్షల మంది ఏటా చదువుతున్నారు.

నియంత్రణ లేని ఫీజులు

పలు విద్యాసంస్థల్లో నియంత్రణ లేని ఫీజులను వసూలు చేస్తున్నట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లే స్కూల్‌, నర్సరీ, ఎల్‌కేజిలకు రూ.10 వేల నుంచి రూ.20 వేలు, 1 నుంచి 5 వరకూ రూ.15 వేల నుంచి రూ.35 వేలు, 6 నుంచి 10 వరకూ రూ.30 వేలు నుంచి లక్ష వరకూ కూడా వసూలు చేసే కార్పొరేట్‌ పాఠశాలలున్నాయి. అలాగే బస్సు, యూనిఫామ్‌, పుస్తకాలు ఇలా రకరకాల పేర్లతో ఫీజులు కలెక్షన్‌ జరుగుతుంది. ఫీజుల విషయంలో నిబంధనలు పాటించడం లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ విద్యాశాఖ అధికారులపై మండిపడుతున్నారు. 1994లో వచ్చిన జిఒ నెంబర్‌ 1 ప్రకారం ప్రయివేటు పాఠశాల ప్రిన్సిపల్‌, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఇద్దరితో ఒక కమిటీని నియమించాలి. వసూలు చేసిన ఫీజులో ఐదు శాతం యాజమాన్యం, మిగిలిన మొత్తం పాఠశాల అభివృద్ధి, ఉద్యోగుల, సిబ్బంది వేతనాలు, వారికి బీమా, పాఠశాల నిర్వహణకు వ్యయం చేయాలి. 2008లో విడుదల చేసిన 90, 91, 92 జిఒల ప్రకారం జిల్లా విద్యాశాఖ అధికారి, ఒక స్వచ్చంద సంస్థ ప్రతినిధి, ప్రయివేటు విద్యాసంస్థల ప్రతినిధులతో ఒక కమిటీని జిల్లా ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో నియమించాలి. అయితే జిల్లాలో ఇవి ఎక్కడా అమలు కావడం లేదు.

కానరాని సౌకర్యాలు

పలు విద్యాసంస్థలు అపార్టుమెంట్లు, రేకుల షెడ్లలో తరగతులను నిర్వహిస్తున్నాయి. గాలి, వెలుతురు వచ్చే విశాలమైన తరగతి గదులు ఎక్కడా కానరావు. ఉపాధ్యాయులకు అర్వతలతో పని లేకుండా ఎవరు ఎక్కువ విద్యార్థుల్ని పాఠశాలల్లో చేర్పిస్తే వారికే ఎక్కువ జీతాలు ఇస్తారు. జిల్లాలో పలు విద్యాసంస్థలకు ప్రాథమిక పాఠశాల వరకు అనుమతులుంటాయి. అయితే హైస్కూల్‌ స్థాయిలో బోధన ఉంటుంది. ఇక ప్రీ స్కూల్‌, టెక్నో, ఈ-టెక్నో, ఐఐటీ, ఒలంపియాడ్‌ తదితర తోకలను పాఠశాల పేర్లకు ముందో వెనకో తగిలించి రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు.

నేతల అడ్డుకట్ట

గుర్తింపు లేదని, వసతులు సక్రమంగా లేవని ఒకవేళ అధికారులు పాఠశాలలపై చర్యలకు ఉపక్రమిస్తుంటే రాజకీయ నాయకుల ప్రోద్భలంతో తిరిగి పాఠశాలల్ని తెరుస్తున్నారు. దీంతో అధిక ఫీజుల వసూళ్లు, పుస్తకాలు, దుస్తులు తప్పనిసరిగా కొనాల్సిందే అనే నిబంధనలపై తల్లిదండ్రులు విద్యాశాఖ ఆధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయించాలి. కానీ ఇది జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. అధికారులు మాత్రం నామమాత్రపు తనిఖీలు చేస్తూ సౌకర్యాలు లేకున్నా, పాఠశాలల యజమానులు నిబంధనలు పాటించకున్నా ఆన్నీ ఉన్నట్టే అనుమతులు మంజూరు చేస్తున్నారు.

ఫీజులపై నియంత్రణ ఉండాలి

ప్రభుత్వ ఆధీనంలో ఉండవలసిన విద్యని నయా ఉదారవాద విధానాల ఫలితంగా విద్యారంగాన్ని ప్రయివేటు, కార్పొరేట్‌ కబంధ హస్తాల్లో నలిగిపోతోంది. ప్రయివేట్‌, కార్పొరేటర్‌ సంస్థ ఫీజులపై కనీసం ప్రభుత్వం నియంత్రణ కూడా చేయడం లేదు. గతంలో తీసుకువచ్చిన జిఒ నెంబర్‌ 53 ప్రకారం ప్రయివేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థలు గ్రామీణ, పట్టణ, నగరంలో ఎంత ఫీజు వసూలు చేయాలనేది ఉండేది. అయితే జిఒ ఇచ్చినప్పటికీ ఆ జిఒని అమలు చేయడంలోనూ..కాపాడడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. తల్లిదండ్రుల రక్తాన్ని తాగేస్తున్న ప్రయివేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి. రూ. వేలల్లో వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించాలి.

– ఎం.గంగా సూరిబాబు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి, కాకినాడ

➡️