ఎల్‌ఐసిలో నూరు శాతం విదేశీ పెట్టుబడులను అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లుకు వ్యతిరేకంగా ఎల్‌ఐసి ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం భోజన విరామ సమయంలో పెద్దాపురం, తుని ఎల్‌ఐసి బ్రాంచ్ కార్యాలయల వద్ద ఉద్యోగులు ధర్నాలు నిర్వహించారు.
ప్రజాశక్తి – పెద్దాపురం, తుని
పెద్దాపురం ఎల్‌ఐసి బ్రాంచ్ కార్యాలయం వద్ద భోజన విరామం సమయంలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడుతూ బీమా రంగంలో ప్రపంచ స్థాయిలో భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసి) ప్రథమ స్థానంలో ఉందన్నారు. గతంలో ఎల్‌ఐసిలో 25 శాతం నుంచి 74 శాతానికి విదేశీ పెట్టుబడులను అనుమతించారన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా ఎల్‌ఐసిలో నూరు శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం ముసాయిదా రూపొందించి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను ఎల్‌ఐసి ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. దేశ ఆర్థిక పటిష్టతకు రక్షణగా ఉన్న ఎల్‌ఐసిని రక్షించుకోవాల్సిన బాధ్యత భారత పౌరులందరిపై ఉందన్నారు. ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకూ తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వై.వేణుగోపాలరావు, ఎం.రామకృష్ణ, సహాయ కార్యదర్శి వై.సునీల్‌కుమార్, కోశాధికారి ఎంవి.దత్తు, ఎవిఎన్.సోమరాజు, సాయికృష్ణ, జోత్స్నా, తదితరులు పాల్గొన్నారు. అలాగే తుని బ్రాంచ్ కార్యాలయం వద్ద భోజన విరామం సమయంలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌ఐసి ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఎం.సాయిబాబా,, కెఎన్‌వి. సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్థిక రంగంలో బలంగా ఉన్న ఎల్‌ఐసి బీమా రంగాన్ని బలహీన పరిచేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చిందనప్నారు. దీనిని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, ఏజెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.