ప్రజాశక్తి – కాకినాడ
రైతులు పండించిన ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా కోనుగోలు చేయాలని కలెక్టర్ షాన్‌మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయం, సహకార, రైస్ మిల్లర్లతో ధాన్యం కొనుగోలు కమిటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కనీస మద్దతు ధర అమలు, రైతు సేవా కేంద్రాల నుంచి ధాన్యం కోనుగోలు, తేమ శాతం, సిఎంఆర్, బ్యాంకు గ్యారంటీలు, గోనె సంచులు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల ఆరు గాలం కష్టపడి పండించిన పంటను కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు కోనుగోలు చేయడానికి వీలు లేదన్నారు. కనీస మద్దతు ధరపై రైస్ మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలు తప్పని సరిగా పాటించాలని స్పష్టం చేశారు. జిల్లాలో ధాన్యం సేకర ణకు 225 కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిం దని, రైతు సేవా కేంద్రంలోని టెక్నికల్ అసిస్టెంట్ రైతుల కళ్లాల వద్దకు వెళ్ళి ధాన్యాన్ని పరిశీలించి డేటా ఎంట్రీ ఆపరేటర్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసి వెహికల్ మూమెంట్ జీపిఎఫ్ ట్రాక్ చేసి మిల్లుకు పంపించాలన్నారు. రైతులు తాము పండిచిన ధాన్యాన్ని దళారులు, మధ్యవర్తు కులకు అమ్ముకుని మోసపోకుండా నాణ్యత ప్రమాణాలకు లోబడి తమ ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు మాత్రమే అమ్మాలన్నారు. జిల్లాలో నేటి వరకు 300 మంది రైతుల నుంచి సుమారుగా 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిం దని తెలిపారు. ధాన్యం సేకరణకు అవసరమైన గోనె సంచులను, హమలీలు, రవాణాకు అవసరమైన వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. సేకరించిన ధాన్యాన్ని రైతు కోరిన రైస్ మిల్లుకు జీపీఎస్ తో కూడిన వాహనాల్లో రవాణా చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ వెంకటరావు, పౌరసరఫరాల సంస్థ డిఎం ఎం.దేవులానాయక్, డిఎస్‌ఒ ఆర్‌ఎస్‌ఎస్.సీతా రామరాజు, వ్యవసాయ శాఖ జేడీ ఎన్.విజరు కుమార్, పాడా పీడీ ఎ.చైత్రవర్షణి, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ బుల్లిరాణి, రాష్ట్ర రైస్ మిల్స్ అసోసియేషన్స్ సెక్రెటరీ వి.సూర్యప్రకాశ్‌రావు, జిల్లా రైస్ మిల్లు అసోసియేషన్స్ ప్రెసిడెంట్ ఎన్.రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.