ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి
నాణ్యమైన ఉన్నత విద్య మిథ్యగానే మారుతోంది. పలు ప్రభుత్వ, ప్రయివేటు డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులు సమస్యల నడుమే చదువులు సాగిస్తున్నారు. ముఖ్యంగా ప్రయివేటు కళాశాల యాజమాన్యాలు వ్యాపారమే పరమావధిగా భావిస్తూ నానాటికి విద్యా ప్రమాణాలను దిగజారుస్తున్నారు. విద్యార్థి దశలో వారి ఉద్యోగావసరానికి ఉన్నత విద్య ఎంతో ముఖ్యం. అటువంటి ఉన్నత విద్య నాణ్యతా ప్రమాణాల ప్రకారం అందని దుస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కళాశాలల్లో కనీస సౌకర్యాలు కనిపించడం లేదు. ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నారు. ఉన్నత విద్యలో నాణ్యతను పెంచి నైపుణ్యమైన మానవ వనరుల అభివృద్ధి చేయాలని విశ్వవిలయాల నిధుల మంజూరు సంస్థ (యుజిసి) లక్ష్యంగా పెట్టుకున్నా అవి నెరవేరడం లేదు. యుజిసి లక్ష్యాలకు ప్రయివేటు, కార్పొరేట్ యాజమాన్యాలు తూట్లు పొడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్నత విద్య అందిస్తున్న విద్యా సంస్థలన్నీ తప్పనిసరిగా జాతీయ మదింపు, గుర్తింపు సంస్థ(నాక్) గుర్తింపు పొందాలని యుజిసి, ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఇ) గతంలో మార్గదర్శకాలు జారీ చేశాయి. కానీ అమలు మాత్రం ఎక్కడా కానరావట్లేదు.ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 399 డిగ్రీ, పీజీ, ప్రొపెషనల్, లా, బీఎడ్, ఫార్మసీ ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలలు ఉన్నాయి. వీటిలో 46 మాత్రమే న్యాక్ గుర్తింపు పొందాయి. మిగిలిన కళాశాలలు అసౌకర్యాల చెరలో కొట్టుమిట్టాడుతుండగా గుర్తింపుకు దూరంగా ఉన్నాయి.అరకొర సౌకర్యాలే గతిప్రభుత్వ కళాశాలల్లో సైతం మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. సెట్, నెట్‌లలో క్వాలిఫై అయిన అధ్యాపకులను మాత్రమే నియమించాలి. కానీ పలు కళాశాలల్లో గెస్ట్, కాంట్రాక్ట్ అధ్యాపకులే బోధిస్తున్నారు. 80 శాతం రెగ్యులర్ అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాకినాడ జిల్లాలో ఆరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, రెండు ఎయిడెడ్ కాలేజీలు ఉండగా 220 మంది రెగ్యులర్ అధ్యాపకులు ఉండాలి. ప్రస్తుతం 85 ఖాళీలు ఉండగా వీటి స్థానంలో పార్ట్ టైం అధ్యాపకులను నియమించి బోధన సాగిస్తున్నారు. కొన్ని చోట్ల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. సరైన ల్యాబులు, లైబ్రరీలు అందుబాటులో లేవు. మరుగుదొడ్లు కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బాలికల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో నిధులు సక్రమంగా విడుదల కాకపోవడంతో కనీస సౌకర్యాలు కరువవుతున్నాయి. కాకినాడలోని పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి, రెండు, మూడు సంవత్సరాల్లో అన్ని గ్రూపుల్లో 3,500 మంది చదువుకుంటున్నారు. ఇక్కడ సరిపడా తరగతి గదులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకులు లేరు. మరుగుదొడ్లు, ల్యాబ్స్, లైబ్రరీ, త్రాగునీరు సమస్యలున్నాయి. అలాగే కాకినాడ, పిఠాపురం, పెద్దాపురం, తుని వంటి ప్రాంతాల్లో పలు ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో సైతం ఇరుకు గదుల్లోనే బోధన సాగిస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు.భారీగా ఫీజులు వసూలు చేస్తున్నా…పలు ప్రయివేటు, కార్పొరేట్ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. కాని విద్యాసంస్థల్లో సౌకర్యాలు పట్ల కనీస శ్రద్ధ చూపడం లేదు. దీంతో అరకొర సౌకర్యాల నడుమ విద్యార్థులు చదువులను పూర్తి చేస్తున్నారు. ఉన్నతాధికారుల నియంత్రణ కొరవడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 80 శాతం ప్రయివేటు విద్యాసంస్థల్లో ఇదే పరిస్థితి నెలకొంది. న్యాక్ గుర్తింపు ఇలా…న్యాక్ ఉన్నత విద్యాసంస్థలను మదింపు చేసి తగిన గుర్తింపు జారీ చేస్తుంది. పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలను, బోధన, అభ్యసన, మూల్యాంకన పద్ధతులు, పరిశోధన, వినూత్న ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, విద్యార్థుల సంక్షేమం, పరిపాలన, నాయకత్వం, యాజమాన్య పద్ధతులను పరిగణలోకి తీసుకుంటారు. ఈ సంస్థ నియమించిన టీమ్ ఆయా కాలేజీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి 8 కేటగిరీల్లో ఏ ప్లస్,ప్లస్, ఎప్లస్, బిప్లస్, ప్లస్, బిప్లస్, బి,సి,డి గ్రేడ్లు కేటాయిస్తుంది. అయితే ప్రభుత్వం గతేడాది న్యాక్ గుర్తింపు తప్పనిసరి అని ప్రకటించినా పలు యజమాన్యాలు ఈ విషయంలో నిబంధనలు ఏ మాత్రం పాటించడం లేదు. ఈ నేపథ్యంలో అర్హత గల అధ్యాపకులను నియమించి, మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ప్రభుత్వం నిబంధనలను ప్రకారం ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజులను క్రమబద్దీకరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.