ప్రజాశక్తి – సామర్లకోట, పెద్దాపురంరైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ఎవరి భూములు వారికే దక్కే విధంగా రీ సర్వే అప్డేట్, డేటా ఎంట్రీ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని పెద్దాపురం ఆర్‌డిఒ కె.శ్రీరమణి సూచించారు. సామర్లకోట టిటిడిసి శిక్షణా కేంద్రంలో డివిజన్ పరిధిలోని 11 మండలాలకు చెందిన మండల సర్వేయర్లు, రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్‌లు, గ్రామ సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ అధికారులకు శిక్షణా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఒ శ్రీరమణి మాట్లాడారు. భూ సమస్యలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు నమోదైనా వాటిని సానుకూలంగా పరిష్కరించాలన్నారు. దానికి సంభందించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సూచనలు అందించినందున వాటిని అనుసరించి గ్రామాల్లో రైతులకు సేవలనందించాలన్నారు. ఈ సందర్బంగా రీ సర్వే, డేటా ఎంట్రీ పై పలువురు మండల స్థాయి అధికారులకు పలు విషయాలు వివరించారు. డిఎస్‌ఎల్‌ఒ కె.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.పెద్దాపురం రీ సర్వే అప్డేటెడ్ ఎస్‌ఒపి డేటా ఎంట్రీ పై రీ సర్వే శిక్షణను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని సకాలంలో సర్వే పూర్తి చేయాలని ఆర్‌డిఒ శ్రీరమణి అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయంలో డివిజన్‌లోని 11 మండలాల తహశీల్దార్లు, రీ సర్వే డిప్యూటీ తహశీల్దార్లు, మండల సర్వేయర్లు, గ్రామ సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ అధికారులకు రీ సర్వేపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌ఎల్‌ఒ కె.శ్రీనివాసరావు, పెద్దాపురం తహశీల్దారు సిహెచ్.వెంకటలక్ష్మి, డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు పాల్గొన్నారు.
