ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి
10వ తరగతి పరీక్షలు విద్యార్థులకు చాలా కీలకం. ఈ పరీక్షలు వారి భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. పరీక్షలను విజయవంతంగా అధిగమించడానికి విద్యార్థులు క్రమబద్ధమైన, సమయపూర్వకమైన ప్రణాళికతో శ్రమిస్తారు. టెన్త్ తర్వాత వారు ఎంచుకునే కోర్సులు, వృత్తి విద్యా కోర్సులు, సర్టిఫికేట్ కోర్సులు, పాలిటెక్నిక్, డిప్లోమా వంటివి వారి వారి భవిష్యత్తుకు కీలకంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో మార్చి 17 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేస్తూ వస్తుంది. పరీక్షలు సమీపిస్తున్న వేళ మెటీరియల్ పంపిణీ విషయంలో ఈ ఏడాది సర్కారు చేతులెత్తేయడంతో చదివేదెలా అంటూ విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. కాకినాడ జిల్లాలో 457 పాఠశాలల్లో 27,498 మంది 10వ తరగతి రెగ్యులర్ విద్యార్థులు ఉన్నారు. వీరిలో 13,763 మంది బాలురు, 13,735 మంది బాలికలు ఉన్నారు. మార్చి 17 నుంచి 142 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పరీక్షల నిర్వహణకు యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ప్రణాళికను విద్యాశాఖ తయారు చేసింది. ఆ ప్రణాళిక ప్రకారం చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా సబ్జెక్టు నిపుణులతో తయారు చేయించిన స్టడీ మెటీరియల్‌ను అందజేయాల్సి ఉంది. అయితే ఇంతవరకు ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. స్టడీ మెటీరియల్ ఇచ్చేందుకు తమ వద్ద నిధులు లేవంటూ విద్యార్థులపైనే భారం వేస్తోంది. ప్రతీ ఏడాది జడ్‌పి నుంచి స్టడీ మెటీరియల్‌ను అందజేసేవారు. ఈ ఏడాది ఇప్పటివరకు ప్రభుత్వం పంపిణీకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. గతంలో పాలన సాగించిన టిడిపి, వైసిపి ప్రభుత్వాలు సకాలంలోనే విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేశాయి. అయితే ఈ సారి ఎందుకో కూటమి ప్రభుత్వం దీనిపై పెద్దగా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు.విద్యార్థులపైనే పిడిఎఫ్ ఫ్రింట్ల భారం రాష్ట్ర విద్యాశాఖ తయారు చేసిన క్వశ్చన్ బ్యాంక్, మోడల్ ప్రశ్న పత్రాలతో కూడిన బుక్లెట్లను పిడిఎఫ్ ఫైల్ రూపంలో వచ్చిన వాటిని అలాగే స్కూళ్లకు పంపించినట్లు అధికారులు చెబుతున్నారు. వాటిని ప్రింట్ తీసుకుని చదువుకోవాలని సూచిస్తున్నట్లు విద్యార్థులు వాపోతున్నారు. లాంగ్వేజెస్ బుక్ లెట్ 198, నాన్ లాంగ్వేజెస్ 218 పేజీలు ఉండడంతో ప్రింటింగ్ తీయించుకుని చదువు కోవాలంటే విద్యార్థులకు అదనపు భారం తప్పడం లేదు. పేద, మధ్యతరగతి విద్యార్థులు నగదు వెచ్చించి ప్రింట్ తీయించుకోవడానికి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒక్కో పేపర్‌కు కనీసం రూ. 2 నుంచి రూ.3 చొప్పున లెక్కించినా రూ. వెయ్యి పైనే ఖర్చు అవుతోంది. ఇలా మొత్తం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా చూస్తే వారిపై దాదాపు రూ.2.74 కోట్ల భారం పడుతోంది.40 రోజులే గడువువచ్చేనెల 17 నుంచి 31వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. కేవలం 40 రోజులే గడువు ఉంది. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు 100 రోజుల ప్రణాళికతో సన్నద్ధం చేస్తున్నారు. అయితే ఏటా ప్రభుత్వం స్టడీ మెటీరియల్ రూపొందించి ఇచ్చేది. అయితే ఈ ఏడాది అటువంటి ప్రయత్నమేమీ చేయకపోవడంతో విద్యార్థులు ప్రభుత్వ తీరుతో మండిపడుతున్నారు.