డ్రైనేజీలపై వేసిన రాళ్లు తొలగించండి

Jun 8,2024 14:31 #Kakinada

లేదంటే మేమే తొలగిస్తాం
ఆ చార్జీలు వసూలు చేస్తాం
వ్యాపారస్తులకు కమిషనర్ ఆదేశం

ప్రజాశక్తి-కాకినాడ : డ్రైనేజీలలో పూడికతీత పనులకు అవరోధంగా ఉన్న స్లాబ్ రాళ్లను తక్షణమే తొలగించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జే.వెంకటరావు వ్యాపారులను ఆదేశించారు. స్లాబ్ రాళ్లను స్వచ్ఛందంగా తొలగించకపోతే వాటిని నగరపాలక సంస్థ తరఫున తొలగించి అందుకు అయ్యే ఖర్చును వసూలు చేస్తామని స్పష్టం చేశారు. శనివారం ఆయన కాకినాడ నగరంలో పూడికతీత పనులను పర్యవేక్షించారు. గాంధీనగర్, చీడీలపొర ప్రాంతాలలో టీఎంఎక్స్ మిషన్ ద్వారా జరుగుతున్న డి-సిల్టేషన్ పనులను ఆయన పరిశీలించి అక్కడ ఉన్న సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అలాగే రేచర్ల పేట, దుమ్ములపేట, సినిమా రోడ్ ప్రాంతాలలో కార్మికుల ద్వారా జరుగుతున్న పూడికతీత పనులను కూడా ఆయన పర్యవేక్షించారు. పలుచోట్ల పూడికతీత పనులకు డ్రైనేజీలపై ఉన్న స్లాబ్ రాళ్లు అవరోధంగా ఉన్న అంశాన్ని ఆయన గుర్తించారు. వెంటనే వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పలు ప్రాంతాల్లో వ్యాపారస్తులు డ్రైనేజీలను ఆక్రమించి స్లాబ్ రాళ్లను ఏర్పాటు చేశారని, దీనివల్ల డి-సిల్టేషన్ పనులకు తీవ్ర అంతరాయం కలుగుతోందన్నారు. సకాలంలో పూడికతీత పనులు పూర్తి కాకపోతే రానున్న రోజుల్లో వర్షాలు పడే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్నారు. అందువల్ల వ్యాపారులు సహకరించి స్వచ్ఛందంగా డ్రైనేజీలపై వేసిన రాళ్ళను తొలగించాలని సూచించారు. వారం రోజుల్లో డి-సిల్టేషన్ పనులను పూర్తి చేయాలని ఆయన ప్రజారోగ్య విభాగాన్ని ఆదేశించారు. వర్షాకాలంలో ఎక్కడా నీరు నిలిచిపోకుండా చూడాలన్నారు. ఆయన వెంట శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ సత్తెప్ప నాయుడు, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు.

➡️