అనుమతుల్లేని ఆర్‌ఒ ప్లాంట్లు

Jun 8,2024 23:05
మానవ జీవితంలో

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి

మానవ జీవితంలో నీరు అతి ముఖ్యమైన వనరు. అందుకే శుద్ధ జలాల కోసం ప్రజలు ఎంతైనా ఖర్చు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో కొళాయిల ద్వారా వస్తున్న నీటిని తాగలేని అనేకమంది ప్రజలు ఆర్వో ప్లాంట్ల నీటిపైనే ఆధారపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పేదలు సైతం ప్లాంట్ల వద్దకు వెళ్లి రూ.5 నుంచి రూ.10 ఇచ్చి బిందె నీరు కొని తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పట్టించుకోకపోవడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనుమతి లేకుండానే వేలాది ఆర్‌ఒ ప్లాంట్లు పుట్టుకొచ్చాయి. దీంతో తాగునీటి వ్యాపారం యథేచ్ఛగా సాగిపోతోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అనేక మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు వెలిశాయి. ప్రభుత్వ అనుమతి లేకుండానే ప్లాంట్ల నిర్వాహకులు జోరుగా నీటి వ్యాపారం సాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతో బాటు తుని, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, మండపేట, రామచంద్రాపురం, అమలాపురం పట్టణ, పరిసర ప్రాంతాల్లోనే కాక ఇతర అన్ని మండల కేంద్రాలు, పలు పంచాయతీల పరిధిలో చిన్నా పెద్దా కలిపి అనధికారికంగా వందలకొలదీ ప్లాంట్లు నడుస్తున్నాయి. మూడు జిల్లాల్లో ఇలాంటివి సుమారుగా 4 వేలకు పైగానే ఉన్నాయని అంచనా. ఇళ్ళల్లోని బోర్లు, బావుల నుంచి నీటిని ట్యాంకుల్లోకి నింపి, శుద్ధి చేయకుండానే రుచి కోసం కొంచెం రసాయనాలు కలిపి విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.వ్యాపారం రూ.కోట్లలో…20 లీటర్ల క్యాన్‌కు రూ.15 నుంచి రూ.20 వసూలు చేస్తున్నారు. ఒక్కో ప్లాంటు నుంచి రోజుకు సుమారు 100 క్యాన్ల వరకు అమ్ముతున్నారు. ఇలా మూడు జిల్లాల్లో అనధికారికంగా రోజుకు సుమారు 80 లక్షల లీటర్ల నీరు సరఫరా చేస్తున్నారు. అంటే రోజూ రూ.80 లక్షలు చొప్పున నెలకు రూ.24 కోట్ల పైనే నీటి వ్యాపారం చేస్తున్నారు. ఫ్లోరైడ్‌, కలుషిత నీటిపై ప్రజల్లో అవగాహన పెరగడంతో శుద్ధి నీటి కోసం పరుగులు పెడుతున్నారు. బోర్లు, రక్షిత పథకాల నుంచి వస్తున్న నీటిని ఇతర అవసరాలకు ఉపయోగిస్తూ తాగునీటి కోసం మినరల్‌ వాటర్‌ క్యాన్లు కొనుగోలు చేస్తున్నారు. ఇందు కోసం ఒక్కో కుటుంబం నెలకు రూ.400 నుంచి రూ.600 వరకు ఖర్చు చేస్తోంది. పెళ్లిళ్లు, విందులకు ప్లాంట్ల నిర్వాహకులు ఏకంగా డ్రమ్ములతో సరఫరా చేస్తూ భారీగా డబ్బు వసూలు చేస్తున్నారు. వేసవిలో దందా ఎక్కువగా ఉంటుంది.నిబంధనలకు నీళ్లు నీటిలో స్వచ్ఛతను కొలిచేందుకు టిడిఎస్‌ (టోటల్‌ డిజాల్వ్‌డ్‌ సాలిడ్స్‌)ను ప్రామాణికంగా తీసుకుంటారు. నీటిలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, బైకార్బొనేట్స్‌, క్లోరైడ్స్‌, సల్ఫేట్స్‌ కరిగి ఉంటాయి. టిడిఎస్‌ పిపిఎం (పెలాటబిలిటీ కోషెంట్‌ మిలియన్‌) స్థాయి 1000 దాటితే ఆ నీరు విషతుల్యం అవుతుంది. ఈ నీరు తాగితే మూత్ర పిండాలు పాడవుతాయి. జీర్ణవ్యవస్థ దిబ్బతింటుంది. ప్రాణాపాయం కలిగేంత అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటైన నీటి శుద్ధి కేంద్రాల నుంచి నమూనాలు సేకరించి, నాణ్యత ప్రమాణాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉంది. ప్రతి ప్లాంట్‌లో బ్యూరో ఆఫ్‌ ఇండియా స్టాండర్డ్‌ (బిఐఎస్‌) ప్రమాణాలు పాటించాలి. ఎస్‌ఎస్‌ఐ, ఐఎస్‌ఐ రిజిస్ట్రేషన్లతోపాటు కాలుష్య నియంత్రణ, ట్రేడ్‌ మార్క్‌ రిజిస్ట్రేషన్‌ వంటి 14 మార్గదర్శకాలు పాటించాల్సి ఉంటుంది. ప్లాంటు వద్ద అర్హత గల ల్యాబ్‌ టెక్నీషియన్లను నియమించాలి. అనేక మంది నిర్వాహకులు ఇవేమీ పాటించడం లేదు.పర్యవేక్షణ శూన్యం ప్యూరిఫైడ్‌ నీటి పేరుతో మోసం చేస్తున్న ప్రైవేటు జల కేంద్రాలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సి ఉంటుంది. పంచాయతీ పరిధిలో అయితే పిహెచ్‌సి వైద్యులు, ఆహార తనిఖీ అధికారి, ఎంపిడిఒలు తనిఖీ చేయొచ్చు. నగరపాలక సంస్థ పరిధిలో ఆర్‌డబ్ల్యుఎస్‌, టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు పరిశీలించాలి. ఆయా శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, సిబ్బంది మామూళ్లకు అలవాటు పడడంతో ప్లాంట్ల వైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

➡️