ప్రజాశక్తి – కాకినాడ
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం రూ.25 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సివుందని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఆర్.సూర్యనారాయణ తెలిపారు. ఆదివారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా 3వ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగ సమస్యలకు సంబం ధించి విషయాలను ఆయన మీడియాకు వివరించారు. ప్రతినెల ఉద్యోగులకి సుమారు రూ.6500 కోట్ల వేతనాలు ఇవ్వాల్సి వస్తుందని, ఇంకా రకాల బెనిఫిట్లు రావాల్సి ఉందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తమకు పూర్తిగా అవగాహన ఉన్నందువల్ల బకాయి పడిన మూడు డిఎలలో ఒకటి ప్రకటించి ఉద్యోగులలో ఆశలు చిగురింప చేయాలన్నారు. ఈ విషయంపై 2023 జనవరి 19న గవర్నర్‌ను కలిసి ఉద్యోగుల వేతనాలకు చట్టబద్దత చేయాలని కోరడంతో కొన్ని ఉద్యోగ సంఘాలు తమను పలు రకాలుగా ఇబ్బందులు గురిచేశాయన్నారు. గత ఏడాది నవంబర్లో బడ్జెట్ సమావేశాల్లో తాము చెప్పిన విధంగానే ఉద్యోగులకు రూ.25 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని సభ దృష్టికి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. అలాగే 14వ వేతన సవరణ అధ్యయనం కమిషన్‌ను రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో నియమిం చాలన్నారు. అలాగే ఎప్పటినుంచో ఉన్న సర్వీస్ నిబంధనలను మార్పు చేసేలా చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్‌కుమార్, జిల్లా అధ్యక్షులు ఎంవిఎస్‌ఎన్. జగన్నాథం పాల్గొన్నారు.