ఆర్‌టిసి సేవలు నిల్‌..!

Apr 20,2024 22:36
అసలే వేసవి..ఆపై ఆర్‌టిసి

ప్రజాశక్తి – సామర్లకోట

అసలే వేసవి..ఆపై ఆర్‌టిసి బస్సుల కోసం మండుటెండలో ప్రయాణికుల ఎదురుచూపులు. గత మూడు రోజులుగా ప్రయాణికులకు జిల్లాలో ఆర్‌టిసి సేవలు కరువయ్యాయి. దీంతో ప్రయాణికులు అష్టకష్టాలను అనుభవించక తప్పని పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేపట్టిన సిద్ధం యాత్ర సందర్భంగా నిర్వహించిన రోడ్డు షోలు, బహిరంగ సభలకు ప్రజలను తరలించేందుకు ఆర్‌టిసి బస్సులను పెద్దఎత్తున వినియోగించారు. దీంతో ఆర్‌టిసిపై ఆధారపడి ప్రయాణించే ప్రయాణికులు, విద్యార్థులు తీవ్రమైన ఇక్కట్లను ఎదుర్కొన్నారు. ప్రధానంగా సామర్లకోట జంక్షన్‌లో శనివారం ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్‌టిసి బస్సులు లేకపోవడంతో బస్టాండులో మండుతున్న ఎండలో ఎదురుచూపులు తప్పలేదు. రాజానగరం మీదుగా రాజమహేంద్రవరం వెళ్లేందుకు బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణీకులు, విద్యార్థులు తీవ్రమైన ఇక్కట్లను ఎదుర్కొన్నారు. వేసవి ఉక్కపోత, ఎండల తీవ్రత అధికంగా ఉండగా వివాహ ముహుర్తాలు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య అధికం అయ్యింది. బస్టాండులో ప్రయాణికులకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఎండలోనే బస్సుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకుంది. ప్రయాణికులకు అవసరమైన మెరుగైన సేవలు అందిస్తున్నామని ఆర్‌టిసి యాజమాన్యాల ప్రకటనలు ఆచరణలో పూజ్యంగానే కన్పిస్తున్నాయి. అవసరమైన బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

➡️