ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి
వ్యాపార లాభార్జనే ధ్యేయంగా పెట్రోలు బ్యాంకుల యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం విధించిన అనేక ప్రమాణాలున్నా అవి పాటించడం లేదు. నిబంధనలు మాకా అంటూ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. బంకుల నిర్వహణలో కనీస ప్రమాణాలని సైతం పక్కన పెట్టి వ్యాపారం సాగిస్తున్నారు. కొన్నిచోట్ల కొలతల్లో తేడాలు చేస్తూ కాసులు వెనకేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల కల్తీ పెట్రోలు, డీజిల్ అమ్ముతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. నిరంతరం బంకుల్లో తనిఖీలు చేయాల్సిన సంబంధిత శాఖల అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం. సంబంధిత యజమానులు వినియోగదారులకు ఉచితంగా పలు సేవలను అందించాల్సిన ఉంది. ఆ సేవలు అందేలా చూడడంతోపాటు ఆయా నిబంధనలు పాటించేలా చూడాల్సిన బాధ్యత వీరిపై ఉంది.ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రధానంగా హెచ్‌పి, ఇండియన్ ఆయిల్, భారత్ కంపెనీలకు చెందిన సుమారు 300 బంకులున్నాయి. ఎక్కవ శాతం బంక్ యజమానులు ప్రభుత్వం విధించిన నిబంధనాలేమీ పాటించడం లేదనే విమర్శలు వినియోగదారుల నుంచి తరచూ వినిపిస్తున్నాయి. నిర్వాహకులు నిర్ధిష్టంగా కొన్ని ప్రమాణాలు పాటించాలని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా వాటిని పెడచెవిన పెడుతున్నారు. కనీసం మరుగుదొడ్ల నిర్వహణ కూడా సక్రమంగా నిర్వహించలేకపోతున్నాయి. సిబ్బంది మాత్రమే వినియోగించుకునే విధంగా మాత్రమే ఉంచుతున్నారు. అధిక శాతం బంకుల్లో వాహనాలకు గాలి పెట్టే సదుపాయం కల్పించడం లేదు. పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించకుండానే ఉన్న వారిపైనే పని ఒత్తిడి పెంచుతున్నారు.నామమాత్రపు తనిఖీలకే పరిమితమా.?పెట్రోల్, డీజిల్ నాణ్యత, కొలతలను పరిశీలించడమే కాక అక్కడ మౌలిక సదుపాయాలు ఉన్నాయా.? లేవా.? అన్న అంశాలపై నిత్యం అధికారులు తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. ప్రతి బంక్‌లో మూత్రశాలలు, మరుగుదొడ్లు సౌకర్యం కచ్చితంగా ఉండేలా యాజమాన్యాలు చూడాల్సి ఉంది. బంక్‌ల వద్ద విద్యుత్ తీగలు బయటకు కనిపించకుండా ఉండాలి. హైటెన్షన్ విద్యుత్ తీగలు లేకుండా చూసుకోవాలి. పెట్రోల్ వేసే పంపుల వద్ద డ్రై కెమికల్ పౌడర్ (డిసిపి), ఫామ్ ఎస్టీమిషల్, బకెట్లలో ఇసుక, నీరు నింపి విధిగా ఉంచాలి. 6 పైపుల నుంచి ఆపై పంపులు ఉన్న పెద్ద బంకుల్లో 50 కేజీల కెపాసిటీ గల డిసిపి, 10 వేల లీటర్ల కెపాసిటీ గల నీటి ట్యాక్‌ను నిత్యం అందుబటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో సమర్థవంతంగా ఎదుర్కొనేలా అన్ని సౌకర్యాలు ఉండాలి. ప్రతి బంకుకు మూడు వైపులా ఆరడుగుల ఎత్తున ప్రహరీ ఉండాలి. వాహనాల చక్రాల్లో గాలిని సరి చూడాలి. తక్కువయితే ఉచితంగా నింపాలి. జాతీయ రహదారిపై ఉన్న బంకుల్లో ప్రయాణికుల సౌకర్యార్థం విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి అత్యవసరంగా చికిత్స అందించేందుకు ప్రధమ చికిత్స, మందుల్ని అందుబాటులో ఉంచాలి. ఇంధన నాణ్యతను పరిశీలించడానికి హైడ్రో ధర్మా మీటరును అందుబటులో ఉంచాలి. వాహనం చోదకులు అడిగితే ఇవ్వాలి. పెట్రోల్ పరిమాణాన్ని కొలిచే పరికరాల్ని వాహనదారుల కోసం అందుబాటులో ఉంచాలి. తాగునీటి సౌకర్యం కచ్చితంగా ఉండేలా చర్యలుండాలి. ఉచితంగా అందించే సేవలపై బంకు ఆవరణలో విధిగా బోర్డు ఏర్పాటు చేయాలి. అయితే అనేక బంకుల్లో ఇటువంటి సౌకర్యాలు ఎక్కడా కనిపించవు. వీటిపై ఆయా యాజమాన్యాలకు సూచనలు ఇవ్వడంతోపాటు వీటిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది.అయితే అనేక మంది యథేచ్ఛగా నిబంధనలు అతిక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 70 శాతం బంకుల్లో మరుగుదొడ్ల సౌకర్యాలే ఉండడం లేదు. పంపుల వద్ద ఇసుక, నీటి బకెట్లను ఎక్కడా ఉంచడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పెట్రోలు పరిమాణాన్ని కొలిచే పరికరాలు, ప్రథమ చికిత్సా కిట్లు, వాహనాల్లో గాలిని నింపే సౌకర్యాలు ఎక్కడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అధికారులు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.సిబ్బంది ఇబ్బందులుఇంధనం నింపే కార్మికులు బంకుల్లో 24 గంటలూ సేవలందిస్తుంటారు. వీరు విడతల వారీగా పని చేస్తారు. వేతనం నెలంతా కష్టపడి పని చేస్తే లభించేది కేవలం రూ.5 వేల నుంచి రూ.8 వేలు మాత్రమే. కొత్తగా పనిలోకి చేరిన వారికి రూ.4 వేలు కూడా చెల్లించని పరిస్థితి ఉంది. చాలీచాలని వేతనాలతో కుటుంబ పోషణ భారంగా ఉందని పలువురు సిబ్బంది వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల విద్యకోసం ఖర్చు చేసే ఫీజులు, విద్యుత్ బిల్లులు, వైద్యం తదితర ఖర్చులకు వచ్చే వేతనం ఏ మూలకూ సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.