యథేచ్ఛగా సారా అమ్మకాలు

Feb 16,2025 21:20
ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

యు. కొత్తపల్లి మండలం కొండెవరంకు చెందిన మంగం విజయరాజు (32) గత కొంత కాలంగా నాటు సారాకు అలవాటు పడి 10 నెలల క్రితం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వైద్యుల వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. ఇతనికి వివాహం కాలేదు. తరచూ నాటు సారా తాగడం వలన పచ్చకామెర్లు వచ్చి చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. చేదోడు వాదోడుగా ఉండే తమ కుమారుడు సారా రక్కసికి అలవాటు పడి మరణించడం పట్ల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నేటికీ కొడుకు జ్ఞాపకాలను మరవలేకపోతున్నామని వారు కన్నీటిపర్వంతం అయ్యారు. ఇదే మండలంలోని రమణక్కపేట గ్రామానికి చెందిన యేసు సారాకు బాగా అలవాటు పడి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మంచాన పడి లెవలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. భార్య, ఇద్దరి చిన్నారులు అతని పరిస్థితి చూసి నిత్యం రోధిస్తూనే ఉన్నారు. రెక్కడితేనే గాని డొక్కాడని ఆ కుటుంబం దుస్థితి చెప్పుకోలేనిది. ఇలా ఎన్నో కుటుంబాల్లో సారా మహమ్మారి కారణంగా మృతి చెందుతున్నారు. మంచాన పడుతున్నారు. కుటుంబాన్ని వీధుల పాలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అధికార యంత్రాంగం నిమ్మకునీరొత్తుతున్నట్లుగానే వ్యవహరిస్తోంది.కాకినాడ జిల్లాలో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా నాటుసార విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ లభిస్తుంది. జిల్లాలో పిఠాపురం, తుని, యు.కొత్తపల్లి, తొండంగి, కోటనందూరు, శంఖవరం, ఏలేశ్వరం, తాళ్లరేవు తదితర మండలాల్లో యథేచ్ఛగా సారా తయారీ జరుగుతోంది. ప్రధానంగా తీర ప్రాంత మండలాల్లో తయారీ ఎక్కువగా ఉంది. తుని నియోజకవర్గ పరిధిలోని హంసవరం, కొత్తూరు, లోవ కొత్తూరు, తాళ్లూరు, తొండంగి మండలంలోని అద్దారిపేట, పంపాదిపేట, వేమవరం, ఒంటిమామిడి, కోటనందూరు మండలంలోని కాకినాడ జిల్లా అనకాపల్లి సరిహద్దు ప్రాంతమైన భీమవరపు కోట, సంఘవాక, అల్లిపూడి, రాజవరం, కొట్టాం తదితర గ్రామాల్లో సారా తయారీ విచ్చలవిడిగా జరుగుతుంది. రాష్ట్ర డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూడా సారా ఏరులై పారుతోంది. ముఖ్యంగా పిఠాపురం పట్టణంలో మొబైల్‌ సారా విక్రయాలు జోరుగానే సాగుతున్నాయి. రూరల్‌ ప్రాంతమైన కందరాడ, మల్లం, విరవాడ, విరవ, బి.కొత్తూరు, పి.దొంతమూరు ఇలా పలు గ్రామాల్లో సారా అమ్మకాలు నిత్యం జరుగుతున్నాయి. ఇటీవల మద్యం ధరలు పెరగడంతో మద్యానికి అలవాటు పడిన సామాన్యులు సారా వైపు మొగ్గు చూపుతున్నారు. మందుబాబుల అవసరాలను ఆసరాగా చేసుకుంటూ కొందరు సారా తయారీ, అమ్మకం దారులు రెచ్చిపోతున్నారు. ఇదే నియోజకవర్గ పరిధిలోని యు.కొత్తపల్లి మండలంలోని కొన్ని మారుమూల గ్రామాల్లో అక్కడక్కడ సారా తయారీ జరుగుతుంది. ఇక్కడ నుంచి పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లోని వివిధ ప్రాంతాలకు చిన్నచిన్న బడ్డీ దుకాణాలకు విక్రయాలకు కోసం సారాను పంపిణీ చేస్తున్నారు. తయారీదారులు రసాయనాలను వినియోగించి తక్కువ సమయంలో కల్తీ నాటు సారాను తయారుచేసి అమ్మకాలు జరుపుతున్నారు. దీంతో అనేకమంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. గతంలో లీటరు సారా రూ.200 లోపు ఉంటే డిమాండ్‌ ఆధారంగా ఇప్పుడు రూ.500 పైనే అమ్ముతున్నారు. అరకొర చర్యలేనా…!ఎన్ని దాడులు చేస్తున్నా, కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నా అక్రమ సారా తయారీ, అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి కారణం ఎక్సైజ్‌ అధికారులే. సారా అమ్మకందారులతో కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. జిల్లాలో గతేడాది అక్టోబర్‌ 1 నుంచి ఈనెల 1 వరకూ 525 సారా కేసులను నమోదు చేసిన అధికారులు 182 మందిని అరెస్ట్‌ చేశారు. 3862 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని 3,23,500 లీటర్ల బెల్లం వూటను ధ్వంసం చేశారు. నల్ల బెల్లం రవాణాపై నిఘా ఉంచామని అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ వెలుగులోకి వస్తున్న కేసులు మాత్రమే. అయితే ఇవన్నీ 20 శాతం మాత్రమే. వాస్తవానికి అంతకు మించి అన్నట్లుగా సారా వ్యాపారం సాగుతున్నా అధికారులు పట్టనట్లు వ్యవహారిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది.

➡️