సర్వేలతో సతమతం..!

Oct 28,2024 22:55
మాతా శిశు మరణాలు తగ్గించడం

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

ప్రజల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతలు చూస్తూ మాతా శిశు మరణాలు తగ్గించడం కోసం కీలక పాత్ర పోషిస్తున్న ఆశా వర్కర్లు సర్వేలతో తీవ్ర స్థాయిలో సతమతమవుతున్నారు. అసలు జాబ్‌ఛార్ట్‌లో లేని, సంబంధం లేని పనులతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పని ఒత్తిళ్ళతో అనారోగ్యాలకు గురవుతున్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులతో సహా అధికార పార్టీలో ఉన్న నేతల వేధింపులను కూడా ఎదుర్కొంటూ అష్ట కష్టాల నడుమ విధులను నిర్వర్తిస్తున్నారు.కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో 3,200 మంది ఆశ కార్యకర్తలు పని చేస్తున్నారు. నిరంతరం ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం పనిచేస్తున్న ఆశాలకు పని ఒత్తిడి ఎక్కువైంది. వివిధ సర్వేల పేరుతో నిరంతరం పని చేయాల్సి వస్తుంది. లెప్రసీ, టీబీ, మలేరియా, ఎన్‌సిబి, పిల్లల ఇమ్యునైజేషన్‌ కోసం ఇంద్ర ధనస్సు వంటి సర్వేలు చేస్తున్నారు. అలాగే ప్రతి గురువారం ఆయా పాఠశాలల్లో ఐరన్‌ టాబ్లెట్లు వీళ్లే మింగించాల్సి వస్తుంది. ఎఎన్‌ఎంలు చేయాల్సిన పనులను ఆశలే చేయాల్సి వస్తుంది.అదనపు పనులతో సతమతంమాత, శిశు మరణాలను అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆశలను నియమించారు. అయితే జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలో ఉన్న లెప్రసి, టీబీ, ఇమ్యూనైజేషన్‌ అధికారులు నేరుగా ఆశలను ఆదేశిస్తూ సర్వేలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ-ఆశా యాప్‌లో తొమ్మిది రకాల పనులను మాత్రమే చేయాలని నిర్దిష్టంగా ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం ఆశాలు వారి వారి పరిధిలో 12 వారాల లోపు గర్భిణీలను గుర్తించి నమోదు చేయాలి. గర్భిణీల ఆరోగ్య పరిస్థితులపై నిర్దేశత సమయంలో విజిట్లు చేసి తగు జాగ్రత్తలు వారికి గుర్తు చేయాలి. గర్భణీలను ప్రోత్సహించి ప్రభుత్వాసుపత్రులలో ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. ప్రసవించిన తర్వాత బాలింతలకు జాగ్రత్తలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. 42 రోజుల్లో ఏడుసార్లు విసిట్‌ చేసి వారికి శిశువుల పరిశుభ్రత భద్రతపై అవగాహన కల్పించాలి.45 రోజులు లోపు వేయవలసిన టీకాలు వేయించే చర్యలు తీసుకోవాలి. వివాహమైన జంట, అలాగే పిల్లలు పుట్టకుండా ఎవరైనా ఉంటే వారి వివరాలను సర్వే చేయాలి. పిల్లల కోసం నిరంతరం పర్యవేక్షణ చేయాలి. ఇలా తొమ్మిది రకాల పనులను ఆశాలు చేసేలా జాబ్‌ చార్ట్‌ ఉంది. అయితే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సంబంధిత విభాగాల ఉద్యోగులు ఆశాలను వివిధ రకాల సర్వేలకు ఉపయోగించుకోవడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా లెప్రసి సర్వే చేయిస్తూ గత రెండేళ్లుగా పారితోషకాలు కూడా ఇవ్వడం లేదు. దీనిపై ఇటీవల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగేశ్వర్‌ నాయక్‌ ను కలిసి వినతి పత్రం ఇచ్చి తమకు అందాల్సిన పారితోషికాలు ఇవ్వాలని కోరారు. అలాగే అదనపు పనులను చేయించుకుంటున్నప్పటికీ అధికారులు ఎటువంటి టిఎ, డిఎలు కూడా ఇవ్వడం లేదు. ఆశాలపై అదనపు పనిభారంలో భాగంగా ప్రతి వారం ఫ్రైడే డ్రైలో కూడా వీరితోనే పనులు చేయిస్తున్నారు.

➡️