ప్రజాశక్తి – కాకినాడ
ఎస్‌సి వర్గీకరణ జాతీయ ఐక్యతకు ముప్పుని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌సి వర్గీకరణ జరిగితే దేశం రెండు ముక్కలవుతుందన్నారు. రాబోయే 20 ఏళ్లలో ఉత్తర భారతదేశం, దక్షిణ భారత దేశంగా అవతరించడం ఖాయమన్నారు. కారణం ఉత్తర భారతదేశంలో మాదిగలెక్కువగా ఉంటారని, దక్షిణ భారతదేశంలో మాలలెక్కువగా ఉంటారని అన్నారు. ఎస్‌సి విభజన వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలుగా విడిపోయాయని అన్నారు. డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఎస్‌సి వర్గీకరణపై తన అభిప్రాయం బయటపెట్టాలన్నారు. టిడిపి పుట్టుక దళితులపై అసూయతోనే జరిగిందని అన్నారు. ఒక్కటిగా కలిసి ఉన్న మాల, మాదిగలను రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాగైనా వేరు చేయాలని టిడిపి కుట్రలు పన్నిందని అన్నారు. అప్పటి కాంగ్రెస్ నేత పర్వతనేని ఉపేంద్ర మాట్లాడిన మాటలు స్వయంగా తానే విన్నానన్నారు. సుప్రీం కోర్ట్ 7గురు న్యాయమూర్తులు ఇచ్చింది ఆర్డర్ కాదు, అది డిజార్డర్ అని వ్యాఖ్యానించారు. 1994లో కాన్సిరాం ఎపికి వచ్చి 1700 మండలాల్లో తిరిగారని ఎస్‌సి, ఒబిసిలను కలపాలని, ఉత్తరప్రదేశ్ ఫార్ములా ఎపిలో సక్సెస్ చేయాలని ఆశించారన్నారు. కాన్సిరాం రాకతో కొంత మందికి కడుపు మండిందని, అప్పుడే వారి మనస్సులో మాల, మాదిగ విభజనకు బీజం పడిందన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఎస్‌సిల విభజనకు పూనుకోవడం జరిగిందన్నారు. యుపి, తమిళనాడు, కేరళలో రాష్ట్రాల్లో లేని ఏకసభ్య కమిషన్‌ను ఎపిలో వేయడం తప్పన్నారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం చేస్తున్న రూ.11 వేల కోట్ల సాయం ఆకలితో ఉన్నవాడి చేతికి అరటి పండు ఇచ్చినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఉక్కు ఫ్యాక్టరీని ఐసియులోకి నెట్టింది టిడిపి ప్రభుత్వమేనని విమర్శించారు.