ప్రజాశక్తి-కాకినాడ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్‌డిఒ ఎస్.మల్లిబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్‌డిఒ ఎస్.మల్లిబాబు అధ్యక్షతన పిసిపిఎన్‌డిటి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య, రెవెన్యూ, లీగల్, స్త్రీ శిశుసంక్షేమ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్‌డిఒ మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. గర్భస్థ పిండం ఆరోగ్య పర్యవేక్షణకు సంబంధించిన పరీక్షలను లింగ నిర్ధారణకు దుర్వినియోగం కాకుండా అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లపై పటిష్ట నిఘా పెట్టామన్నారు. ఆల్ట్రాసౌండ్ వైద్య పరీక్షలు లింగ నిర్ధారణకు ఉపయోగించుకోవడం చట్టరీత్యా నేరమని, డివిజన్ స్థాయిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కాకినాడ డివిజన్ స్థాయిలో గుర్తింపు పొందిన 11 ప్రభుత్వ, 104 ప్రైవేటు మొత్తం 115 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయన్నారు. వీటిపై డెకారు ఆపరేషన్లు, ఆకస్మిక తనిఖీలు సక్రమంగా నిర్వహిస్తామన్నారు. గత ఏప్రిల్ నెల నుంచి నవంబర్ వరకు 8 డెకారు ఆపరేషన్లు, 175 ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు. పిండ లింగ నిర్ధారణ చట్టంపై గ్రామ స్థాయిలో వైద్య ఆరోగ్యం, స్త్రీ శిశుసంక్షేమ, స్వచ్ఛంద సంస్థలను సమన్వయం చేసుకుంటూ మేనరిక వివాహాలు, బాల్య వివాహాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆర్‌డిఒ ఆదేశించారు. గ్రామస్థాయిలో ఎఎన్‌ఎం, ఆశ వర్కర్లు గర్భిణుల గృహాలను సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. రెండు నెలలకు ఒకసారి నిర్వహించే పిసిపిఎన్‌డిటి డివిజన్ స్థాయి సమన్వయ కమిటీలోని ఆయా శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని, అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కానింగ్ సెంటర్లలో పిసిపిఎన్‌డిటి చట్టానికి సంబంధించిన బోర్డులను, వాల్ పోస్టర్లను, ధరల పట్టిక, ఫిర్యాదుల కొరకు టోల్‌ఫ్రీ నెంబర్ 1800-425-3365ను తప్పనిసరిగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఒక స్కానింగ్ సెంటర్ అడ్రస్ మార్పు, ఒక ఉద్యోగి మార్పు, ఒక మిషన్ యాడింగ్‌కి సంబంధిచిన ప్రతిపాదనలు కమిటీ చర్చించి జిల్లా స్థాయి కమిటీ అమోదానికి పంపించామని తెలిపారు. డిఐఒ డాక్టర్ కెవి.సుబ్బరాజు మాట్లాడుతూ మొదటిసారి ఈ చట్ట పరిధిలో చేసిన ఏదేని తప్పుకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తామన్నారు. రెండోసారి ఈ చట్ట పరిధిలో చేసిన ఏదేని తప్పుకు ఐదేళ్ల జైలు శిక్ష రూ.50 వేల జరిమానా విధిస్తామన్నారు. ఈ సమావేశంలో వన్ టౌన్ ఎస్‌ఐ సిహెచ్.కుమార్, జిజిహెచ్ రేడియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నూరున్నీసా బేగం, పిఠాపురం సిహెచ్‌సి పిడియాట్రిషియన్ డాక్టర్ ఎం.కీర్తి ప్రియ, ఎన్‌జిఒలు కె.సింహాద్రి, డి.నాని, హెల్త్ ఎడ్యుకేటర్ పి.సత్యవతి, హెల్త్ అసిస్టెంట్ కె.గోవింద్, ఎల్.శతి ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.