సుందరయ్య 39వ వర్ధంతి

May 19,2024 13:58 #Kakinada
sundarayya death anniversay 2024 kkd a

 విజయవంతమైన ఉన్నంతలో సాయం ఉన్నంత వరకు చేద్దాం పిలుపు

ప్రజాశక్తి కాకినాడ : దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పీడిత ప్రజల ప్రియతమ నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39 వ వర్ధంతి సందర్భంగా కాకినాడ కచేరిపేట సుందరయ్య భవన్ లో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సిపిఎం నగర కమిటీ సభ్యులు కె. సత్తిరాజు అధ్యక్షత వహించారు. ముందుగా సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్, సీనియర్ నేత దువ్వ శేషబాబ్జీ లు సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా రాజశేఖర్, శేషబాబ్జీ లు మాట్లాడుతూ సుందరయ్య జీవితం ఆద్యంతం సేవ, ఉద్యమాలు, పోరాటాలతో, నిరాడంబరత తో ముడిపడి ఉందన్నారు. విద్యార్థి దశలో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని, కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ నాయకుడు గా తదుపరి కమ్యూనిస్టు గా మారి దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సారధి గా సుందరయ్య చరిత్ర ప్రసిద్ధి గాంచారన్నారు. భారత పార్లమెంటులో తొలి ప్రతిపక్ష నాయకుడుగా , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 3 సార్లు శాసనసభ్యుడిగా ప్రజా వాణి వినిపించారని తెలిపారు. అయితే నేటి రాజకీయాలు కార్పొరేట్ ల జోక్యంతో కలుషితం అయిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చాక రాజ్యాంగానికే ప్రమాదం ఏర్పడిందన్నారు. నేటి తరం సుందరయ్య స్ఫూర్తితో విలువల కోసం నిలబడాలన్నారు. ఉన్నంతలో సాయం ఉన్నంత వరకు చేద్దాం అనే పిలుపులో భాగంగా కొంత మంది వారింటిలో ఉపయోగించనివి, అదనంగా ఉన్నవి ఏవైనా బట్టలు గిన్నెలు పుస్తకాలు ఇతర వస్తువులు సుందరయ్య భవన్ కు అందించారు. సుందరయ్య భవన్ పరిసరాల్లో ప్రజలకు ఈ విషయం తెలిపి ఆహ్వానించి తమకు కావలసినవి తీసుకోవాలని కోరగా ప్రజలు విరివిగా సుందరయ్య భవన్ కు వచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు తో పాటు మలక వెంకట రమణ, కె. నాగజ్యోతి, సూర్యనారాయణ, వర్మ, సుబ్బారావు, వెంకట్రావు, శ్రీనివాస్, ఏడుకొండలు, సత్యనారాయణ, ప్రసాదరావు, జగదీష్, సంజయ్, నాగలక్ష్మి, అమృత, విద్య, తదితరులు పాల్గొన్నారు.

➡️