యజమానుల తీరు మారదు..

Jun 9,2024 23:28
సామర్లకోట పట్టణం రోడ్డు

ప్రజాశక్తి – సామర్లకోట

సామర్లకోట పట్టణం రోడ్డు రవాణాలో కాకినాడ జిల్లాలోనే అతి కీలకమైన ముఖ్య కూడలి ప్రాంతం. ఇటు రైల్వే స్టేషన్‌, అటు బస్‌ స్టేషన్‌లు ఎదురెదురుగా ఉన్న ఏకైక పట్టణం ఇది. దానికి మించి ఒకవైపు రాజమహేంద్రవరం, మరోవైపు ద్వారపూడి, కడియం ప్రాంతాలకు, మరోవైపు ఏలేశ్వరం, రంపచోడవరం, అడ్డతీగల వంటి మండలాలకు, పిఠాపురం మీదుగా కత్తిపూడి మీదుగా విశాఖపట్నం ప్రధాన నగరాలకు వెళ్లే రహదారుల కూడలిగా సామర్లకోట పట్టణానికి ప్రాధాన్యత ఉంది. ఇక్కడ ట్రాఫిక్‌ అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో తరచూ రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంది. స్థానిక పోలీస్‌స్టేషన్లో నమోదవుతున్న కేసుల సంఖ్య ఇందుకు ఉదాహరణ.

సామర్లకోటలో ట్రాఫిక్‌ సమస్య అధికంగా ఉంది. అయితే పట్టణంలో ఇటీవల పలు వాహనాలను రోడ్డు మార్జిన్‌లను ఆనుకుని పార్కింగ్‌ చేయడం వలన ప్రమాదాలకు నిలయాలుగా ఆ ప్రాంతాలు మారుతున్నాయి. అసలే ఇరుకు రోడ్డులు అయినందున రెండు భారీ వాహనాలు ఎదురేదురుగా వస్తే తప్పుకోవడమే కష్టతరం. ఈ తరుణంలో రోడ్డు మార్జిన్‌లలో వాహనాలను నిలిపి ఉంచడంతో రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి. స్థానిక పెద్దాపురం రోడ్డులోని ప్రసన్నంజనేయ స్వామి ఆలయం సెంటర్లో రోడ్డు మార్జిన్‌ను ఆనుకుని పలు లారీలు నిలిపి ఉంచడంతో ఒక ఆర్‌టిసి బస్సు ఒక ట్రాక్టర్‌లు తప్పించుకునే స్థలం లేక ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ సమయంలో పోలీసులు రోడ్డు పక్కన ఉన్న వాహనాలను తొలగిస్తూ ఇకపై రోడ్డు మార్జిన్‌లలో భారీ వాహనాలు నిలుపరాదనీ హెచ్చరించడం జరిగింది. దీంతో తాత్కాలికంగా వాహన యజమానులు వారి వాహనాలను అక్కడ నుంచి తొలగించారు. తిరిగి యథాతదంగా వారి వాహనాలను రోడ్డుకు ఇరువైపులా వరుసగా నిలుపుతుం డటంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఆ సెంటర్‌లో ప్రసన్నఆంజనేయ స్వామి, పాండురంగ ఆలయాలతోపాటు విటికర్‌ బాలికల ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. దానితో విద్యార్డులు, భక్తులతో ఈ సెంటర్‌ నిత్యం రద్దీగా కని పిస్తోంది. ఇంకా ఈ సెంటర్‌ మీదుగానే ప్రత్తిb ాడు, శాంతిఆశ్రమం, కిర్లంపూడి, కత్తిపూడి వంటి గ్రామాలకు వెళ్లే ఆర్‌టిసి బస్సులు, ఆటోలు మలుపు తీసుకుని వెళ్ళాల్సి ఉంది. అలాంటి సమయాల్లో విటికర్‌ బాలికోన్నత పాఠశాల ప్రహరీని ఆనుకుని భారీ వాహనాలు నిలిపి ఉంచుతుండటంతో స్థలం సరిపడక ప్రమాదాలు జరుగుతున్నాయి. కేవలం ప్రమాదం జరిగిన సమయాల్లో మాత్రమే ట్రాఫిక్‌ పోలీసులు స్పంది స్తున్నారు. మిగిలిన సమయాల్లో పట్టించుకోక పోవడంతో రోడ్డు మార్జిన్‌లలో వాహన యజమానులు నిర్లక్ష్యంగా నిలిపివేస్తున్నారు. ప్రమాదాలకు నిలకంగా మారిన ఈ సెంటర్లో నిలుపుతున్న భారీ వాహనాలపై నిరంతర పర్యవేక్షణ చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

➡️