ఉద్యోగుల ప్రయోజనాలే ముఖ్యం

Apr 13,2025 00:27
ఉద్యోగుల ప్రయోజనాలే ముఖ్యం

ప్రజాశక్తి-కాకినాడఉద్యోగుల ప్రయోజనాలే ముఖ్యంగా పని చేస్తూ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తామని ఎపి జెఎసి అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం కాకినాడలోని రెవెన్యూ అసోసియేషన్‌ భవన్‌లో బొప్పరాజు మాట్లాడారు. రెవెన్యూ వ్యవస్థలో వస్తున్న మార్పులు, నూతన సాంకేతికతను తెలియజేసేందుకు రెవెన్యూ ఉద్యోగులకు కోసం ఒక రెవెన్యూ అకాడమీ ఏర్పాటు చేసి వారికి తగు శిక్షణను ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. తక్షణమే పిఆర్‌సి కమిషనర్‌ను నియమించాలని, దీనికి ఎటువంటి ఖర్చు ప్రభుత్వానికి అదనంగా అవ్వదని ఆయన తెలిపారు. రెవెన్యూ వ్యవస్థను వేగంగా పనిచేయాలని, ప్రభుత్వం పారదర్శంగా పని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అన్ని శాఖలలో ప్రభుత్వానికి రెవెన్యూ చాలా కీలకమైందని ఇందులో నైపుణ్యం ఉన్న ఉద్యోగులు కింది స్థాయి వారు లేకపోవడంతో పనులు ఆలస్యమై ప్రజల్లో తమ శాఖపై చులకన భావం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో 15 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటే వారిలో 2 వేల మందిని మాత్రమే రెగ్యులర్‌ చేశారని మిగిలిన వారు చాలా ఆందోళనలో ఉన్నారన్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగిస్తారేమోనన్న భయంలో ఉన్నారని అందువల్ల వారికి భరోసా కల్పించాలన్నారు. ఆప్కాస్‌ ద్వారా నియామకం పొందిన వారికి ఏజెన్సీ మార్పు చేస్తారేమోనని ఆందోళనగా ఉన్నారన్నారు. వారికి కూడా ఉద్యోగులకు భరోసా కల్పించాలన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్‌ ఇవ్వాలని, మూడు డిఎలు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయన్నారు. గత అక్టోబర్‌ నెల నుంచి ప్రభుత్వం గ్రాడ్యుటీ ఇవ్వలేదన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ సర్వీసెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పితాని త్రినాథరావు, ఎపిజెఎసి అమరావతి రాష్ట్ర అసోసియేట్‌ చైర్మన్‌ టివి.ఫణి పేర్రాజు, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంసాని శ్రీనివాసరావు, ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిఎస్‌ఎస్‌ఎన్పీ శాస్త్రి, రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్‌ ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకట రాజేష్‌, ఎపి జెఎసి అమరావతి కాకినాడ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి ఎన్విఎస్‌ఎస్‌ఆర్కే దుర్గాప్రసాద్‌, రెవెన్యూ సర్వీస్‌ అసోసియేషన్‌ కాకినాడ జిల్లా శాఖ కార్యదర్శి ఎస్‌ రామ్మోహన్‌, ఉమెన్స్‌ వింగ్‌ చైర్మన్‌ సిహెచ్‌ సంధ్యారాణి, ప్రధాన కార్యదర్శి పి.శిరీష తదితరులు పాల్గొన్నారు.

➡️