నిరాశాజనకంగా కేంద్ర బడ్జెట్‌

Feb 1,2025 22:11
గోదావరి జిల్లా ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసింది.

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసింది. గంపెడాశలు పెట్టుకున్న జిల్లా ప్రజల ఆశలు ఆవిరయ్యాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎపికి ఇప్పుడైనా న్యాయం జరుగుతుందని, భారీగా నిధులు వస్తాయని, విభజన చట్టంలో అంశాలు అమలుకు నిధులు వస్తాయనుకుంటే నిరాశే ఎదురయ్యింది. జిల్లా అభివృద్ధి పట్టని కేంద్రంజిల్లా అభివృద్ధికి అనేక ప్రతిపాదనలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా పట్టాలెక్కాల్సిన రైల్వే ప్రాజెక్టులతోపాటు, గోదావరి జిల్లాల దశ, దిశను మార్చగల ప్రాజెక్టులు అనేకం కేంద్ర ప్రభుత్వం ముంగిట ఉన్నాయి. కాకినాడ ప్రాంతం మరో ముంబాయి మహా నగరంలా మారనుందని ఎన్నో ఆశలను గతంలో కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అందుకు తగిన రీతిలో ఈసారి కూడా బడ్జెట్‌లో ప్రాధాన్యత దక్కలేదని కేంద్ర మంత్రి ప్రకటించిన బడ్జెట్‌ స్పష్టం చేస్తోంది. కీలకమైన పెట్రో కారిడార్‌, భారతమాల ప్రాజెక్టులో భాగంగా ఆరు లైన్ల రోడ్లు, రిఫైనరీ, కేప్టివ్‌ పోర్టు, టెర్మినల్స్‌ ఇలా ఎన్నో ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం ముందు ఉన్నా అవేమీ పట్టించుకోలేదు.పోలవరానికి మోక్షమెప్పుడు.?పోలవరం నిర్మాణ వ్యయ సవరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ.30,436.95 కోట్ల వ్యయానికి, 41.15 మీటర్ల ఎత్తులో నీటి నిల్వకు కేంద్రం ఆమోదం చెప్పింది. పోలవరానికి గత బడ్జెట్‌లో రూ.12,157 కోట్లు కేటాయించగా ఇంకా రూ.12,157 కోట్ల నిధులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలవరానికి కేంద్రం పూర్తిస్థాయిలో నిధులను ఎప్పుడు కేటాయిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రాజెక్టు గనుక పూర్తయితే కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో సాగు, తాగునీటి అవసరాలు తీరతాయి. ఎడమ కాలువ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. రూ.వెయ్యి కోట్ల పైనే ఇంకా నిధులు ఈ పనులకు అవసరం అవుతాయి. కానీ కేంద్రం ఈ బడ్జెట్‌లో అరకొర నిధులను మాత్రమే కేటా యించడంతో పోలవరం ఆశలు ఆవిరయ్యాయని ఆవేద నలు వినిప ిస్తున్నాయి.కలగా కోటిపల్లి – నర్సాపురంకీలకమైన కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైను పూర్తి కావడం కలగానే మిగిలిపోయేలా ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎపిలో అధికారంలో ఉండడంతో ఈ ప్రాజెక్టుపై కోనసీమ వాసులు పెద్ద ఆశలే పెట్టుకున్నారు. కేంద్ర బడ్జెట్లో తప్పకుండా భారీగా నిధులు కేటాయింపు జరుగుతుందని ఆశించినా ఈ బడ్జెట్లో కూడా కోటిపల్లి నరసాపురం రైల్వే పనుల పూర్తిపై ప్రస్తావన రాకపోవడంతో నిరాశ ఎదురైంది.పరిశ్రమలకు మొండి చేయిరూ.32 వేల కోట్ల నిధులతో కాకినాడ పెట్రో కారిడార్‌ పేరుతో పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తామని ఎన్నో ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తూ వస్తుంది. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదేళ్లు దాటుతున్నా పెట్రో కారిడార్‌ ఊసే ఎత్తడం లేదు. ఈ సారైనా కేంద్రం నిధులు ఇస్తుందని ఎదురు చూస్తున్న జిల్లా ప్రజానీకానికి మరోసారి భంగపాటు ఎదురయింది. పిఠాపురం మెయిన్‌ లైన్‌ హామీ ఏదీ.?దశాబ్ధాల కాలం నుంచి కాకినాడ ప్రజలను ఊరిస్తున్న పిఠాపురం మెయిన్‌ లైన్‌ ప్రస్తావన ఈ బడ్జెట్లోనూ లేకుండా పోయింది. కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న బిజెపి ఈసారైనా ఈ ప్రాజెక్టును గట్టెక్కిస్తుందని భావించిన మళ్లీ నిరాశే మిగిలింది. దక్షిణమధ్య రైల్వేలోనే కీలకమైన ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్న కాకినాడ పోర్టు స్టేషన్‌ గూడ్స్‌ పరమైన అభివద్ధి ప్రస్తావన లేకుండా పోయింది.మంత్రి పవన్‌ కళ్యాణ్‌ వల్ల కాకినాడకు ఎన్నో పరిశ్రమలు వస్తాయని కలలు కన్నా, అంతా శూన్యంగా కనబడుతోందని జిల్లా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ బడ్జెట్‌ చూసి చంద్రబాబు, పవన్‌ సిగ్గు పడాలని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదాయం పన్ను రాయితీ ఇచ్చినా పెరిగే ధరలతో మధ్యతరగతి జేబులు ఖాళీ అవుతాయని అందరూ గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే దేశంలో వివిధ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉపాధి లేక పట్టణాలకు వలసలు వెళుతున్న నేపథ్యంలో కనీసం ఉపాధి హామీ చట్టానికి నిధులు సరిగ్గా కేటాయించడం లేదు.కూటమి ప్రభుత్వంలో బీహార్‌ పార్టీల వలె కీలక భాగస్వామ్యంగా ఎపి పార్టీలు ఉన్నప్పటికీ 2025-26 వార్షిక బడ్జెట్‌లో బీహార్‌ కు దక్కిన ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్‌కి లేకపోవడం శోచనీయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బడ్జెట్‌ భారం సాధారణ మధ్యతరగతి పైనే పడింది. పెరిగిన ధరలతో ఆదాయపు పన్ను విషయంలో రూ.12 లక్షల లోపు వారికి మినహాయింపు చూపినా మధ్య తరగతి వారందరికీ కలిసి వచ్చే అవకాశం లేదు.

➡️