పవన్‌ ప్రశ్నలకు సిఎం సమాధానం చెప్పాలి

Nov 30,2024 22:52
డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ వేసిన

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌

కాకినాడ పోర్టోలో పిడిఎస్‌ బియ్యం అక్రమ రవాణాపై డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ వేసిన ప్రశ్నలకు సిఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని వైసిపి జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక రమణయ్యపేట వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు రావాలని, విజన్‌ ఉన్న నాయకుడంటూ జనసేన, బిజెపితో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీల మధ్య సంఖ్యత లేదనే అనుమానం కల్గుతుందన్నారు. డిప్యూటీ సిఎంను పోర్టులోకి రానీయడం లేదని పవన్‌ అన్నారంటే కూటమి ప్రభుత్వంలో ఏమీ జరుగుతుందనే అనుమానం ప్రజల్లో నెలకొందని అన్నారు. ఒకవేళ కసాబ్‌ లాంటి తీవ్రవాదులు చొరబడితే ఎవరూ సమాధానం చెపుతారని ప్రశ్నించిన పవన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. కలెక్టర్‌ వెళ్ళిన షిప్‌లోకి డిప్యూటీ సిఎంను ఎందుకు వెళ్లనీయలేదో స్పష్టం చేయాలన్నారు. గతంలో మంత్రి నాదేండ్ల మనోహర్‌ పట్టుకున్న బియ్యాన్ని మళ్ళీ విడుదల చేశారన్నారు. బియ్యాన్ని విడుదల చేసినప్పుడు సివిల్‌ సప్లయి శాఖ ఏ షరతులు మీద విడుదల చేసిందో బయట పెట్టాలన్నారు. పోర్టు వద్ద రెండు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారని, ఆ చెక్‌ పోస్టులు దాటి బియ్యం పోర్టులోకి ఏలా వెళ్ళాయని ప్రశ్నించారు. అక్రమాలు జరుగుతున్న పోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనిదేనని చెప్పారు. ఇప్పటీకి రేషన్‌ బియ్యం దందా జరుగుతుందని, సిస్టంలో ఉన్న లోపాలను సరిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఐదు నెలలు కాకముందే ప్రజలపై కూటమి ప్రభుత్వం అనేక భారాలను వేసిందని దుయ్యబట్టారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచమని ఎన్నికలకు మందు చెప్పిన చంద్రబాబు నేడు వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేయడం దారుణమన్నారు.

➡️