ప్రజాశక్తి – కాకినాడ
కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై చూపిన చిన్నచూపును వ్యతిరేకిస్తూ సిపిఎం నగర కమిటీ నిరసన చేపట్టింది. కలెక్టరేట్ సమీపంలోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహం సెంటర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు సిహెచ్.రాజ్‌కుమార్, నగర కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌లో సామాన్య మధ్యతరగతి ప్రజలకు దక్కేది ఎంతని ప్రశ్నించారు. విద్య, వైద్య, సంక్షేమ రంగాలకు కేటాయింపులు ఏమాత్రం సరిపడే పరిస్థితి లేదన్నారు. రైతులు పండించే అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేసి, నిరు ద్యోగులకు ఉపాధి కల్పిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. దేశభక్తి గురించి ప్రగల్భాలు పలికే బిజెపి నాయకులు బీమా రంగంలో నూరు శాతం విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షలాది పోస్టులు భర్తీ చేయాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు 200 రోజులు కల్పించి, రోజు వేతనం రూ.600 ఇవ్వాలన్నారు. పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పథకం ప్రారంభిం చాలని సిపిఎం డిమాండ్ చేస్తోందన్నారు. కేంద్రంలో మూడోసారి మోడీ ప్రధాని కావడానికి కీలకంగా మారిన టిడిపి, జనసేన పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విభజన చట్టం హామీల అమలుకు తగిన విధంగా కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని సిపిఎం డిమాండ్ చేస్తోందన్నారు. సంపన్నులకు వరాలు కురిపిస్తూ సామాన్యులపై భారాలు వేసే కేంద్ర బడ్జెట్ ను ప్రజలంతా వ్యతిరేకించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, వేణు, మేడిశెట్టి వెంకటరమణ, రాణి, గంగాధర్, ప్రసాద్, సాగర్, సంజరు, జైరాం, రవి పాల్గొన్నారు.