పగబట్టిన వరుణుడు

Apr 15,2025 22:23
వర్షానికి తడిసి ముద్దయింది.

ప్రజాశక్తి – తాళ్లరేవు

వరుణుడు పగబట్టడంతో ఆరుగాలం కష్టించి పండించిన పంట అకాల వర్షానికి తడిసి ముద్దయింది. ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతు పడుతున్న కష్టాలు చూసి రెండు గ్రామాలు ఏకమై వచ్చినా వరుణుడు కరుణించలేదు. మండలంలో ఆదివారం రాత్రి ఈదురు గాలులు వర్షంతో పాటు, మంగళవారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షానికి పలుచోట్ల పంట పొలాలు దెబ్బతిన్నాయి. స్థానిక మాధవరాయుని పేట గ్రామానికి చెందిన కౌలు రైతు మోర్త బుజ్జి 15 ఎకరాలలో కౌలు వ్యవసాయం చేసి వరి పండిస్తున్నాడు. ఆదివారం 13 ఎకరాలలో యంత్రం సహాయంతో కోత కోసి దాన్యం రాశులుగా పోశాడు. అదేరోజు రాత్రి ఈదురు గాలులతో అకాల వర్షం రావడంతో 13 ఎకరాలకు చెందిన రాశులుగా ఉన్న ధాన్యం ముద్దయిపోయింది. ఆ ధాన్యాన్ని మూడు రోజులుగా ఆరబెడుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా వచ్చిన వర్షంతో ఆరబెట్టిన మొత్తం ధాన్యం మరొక్కసారి తడిసి ముద్దయింది. వర్షానికి తడవకుండా ధాన్యం రక్షించుకోవడానికి రైతు పడుతున్న కష్టాన్ని చూసి చుట్టుపక్కల ఉన్న మాధవరాయనిపేట, జల్లా వారిపేట గ్రామాల ప్రజలు ఏకమై ధాన్యం పోగు చేయడానికి శ్రమించిన ఫలితం లేకుండా పోయింది. తడిసిన ధాన్యాన్ని గ్రామస్తులు చిన్నచిన్న రాశులుగా పోగు చేసిన రైతుకు నష్టం తప్పలేదు. పంట చేతికొచ్చిన సమయంలో చేజారి పోవడంతో ఆ రైతు కంట కన్నీరు పొంగింది. దిక్కుతోచని స్థితిలో మండల వ్యవసాయ అధికారులకు మొరపెట్టుకున్నాడు. అయితే అధికారులు ఏ విధమైన భరోసా కల్పించలేదని, ఏమి చేయాలో పాలు పోవడం లేదని రైతు మోర్త బుజ్జి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మళ్లీ వర్షం వస్తే ధాన్యాన్ని కప్పడానికి బరకాలు లేవని, ఇప్పటికే సుమారు 100 బరకాల వరకు తెచ్చానని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

➡️