ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి
భవిష్యత్తుకు మార్గదర్శకం చేసేదే చరిత్ర అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం కాకినాడలోని అన్నదాన సమాజంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు అధ్యక్షతన ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దువ్వా శేషబాబ్జి రచించిన 1934 నుంచి1964 వరకూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ ఘట్టాలు ‘నవ సమాజం కోసం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర అంటే ఆ కాలంలో ప్రజా పోరాటాల చరిత్రే అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్వాతంత్రోద్యమ కాలంలోనే కమ్యూనిస్టు బీజాలు పడ్డాయన్నారు. ఆనాడు కాకినాడ అన్నదాన సమాజంలో రహస్యంగా పార్టీ ఏర్పడిందన్నారు. 1934-1964 మధ్య జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ ఘట్టాలను వివరిస్తూ శేషబాబ్జి పుస్తకం రచించడం అభినందనీయమన్నారు. బూర్జువా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేయడం కమ్యూనిస్టుల కర్తవ్యం కావాలన్నారు. యువకులు ఈ చరిత్ర పుస్తకాన్ని అధ్యయనం చేయడం ద్వారా సమాజంలో మార్పు కోసం ఏమి చేయాలో మార్గ నిర్దేశం చేయడానికి తోడ్పడుతుందన్నారు. గడిచిపోయిన ఘటనకు సంబంధించింది కాదు చరిత్ర, భవిష్యత్తుకు మార్గ నిర్దేశం చేసేది చరిత్ర అన్నారు. ప్రజా ఉద్యమాలను ఏకం చేయడమే ముందున్న కర్తవ్యమని పిలుపునిచ్చారు. బూర్జువా, భూస్వామ్య పార్టీల కుట్రలు, కుతంత్రాలు ఎదుర్కొని ప్రజలను ఐక్యంగా నిలబెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో చరిత్ర వక్రీకరణ జరుగుతుందని, సామాన్యుల చరిత్రను పక్కనపెట్టి దాని స్థానంలో మతోన్మాద చరిత్రను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీన్ని అడ్డుకోవాలన్నారు. అనంతరం డాక్టర్ చెలికాని స్టాలిన్, డాక్టర్ పి.చిరంజీవినీకుమారి, సిపిఎం తూర్పు గోదావరి జిల్లా టి. అరుణ్, సిపిఐ నాయకులు తాటిపాక మధు, బోడ కొండ, కె.సత్తిబాబు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు, లిబరేషన్ నాయకులు గొడుగు సత్యనారాయణ, చిన్నబిల్లి నాగేశ్వరరావు, సిపిఐఎంఎల్ నాయకులు నాగరాజు, కొండ దుర్గారావు, తదితరులు మాట్లాడారు. దేశాన్ని మతోన్మాద శక్తుల బారినుంచి కాపాడుకోవాలన్నారు. ఐక్య ఉద్యమాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. శేషబాబ్జి కృషిని అభినందించారు. కమ్యూనిస్టు ఉద్యమం అమరులైన నాయకుల కుటుంబ సభ్యులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సభా ప్రాంగణంలో అమరుల ఫోటోలతో పాటు వారి గురించి క్లుప్తంగా తెలియచేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సభకు ముందుగా అమరులకు నివాళులు అర్పించారు. ఈ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎవి.నాగేశ్వరరావు, రచయిత దువ్వా శేషబాబ్జీ, జిల్లా కమిటీ సభ్యులు జి.బేబిరాణి, కెఎస్.శ్రీనివాస్, సిహెచ్.రమణి, సిహెచ్. రాజ్‌కుమార్, నీలపాల సూరిబాబు, నగర కమిటీ సభ్యులు కె. సత్తిరాజు, మలక వెంకట రమణ, దుంపల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సభకు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పలివెల వీరబాబు ఆహ్వానం పలుకగా, ఎం.రాజశేఖర్ వందన సమర్పణ చేశారు. ప్రజా నాట్య మండలి కళాకారులు ఆలపించిన అభ్యుదయ గీతాలు అలరించాయి.