ప్రభుత్వ విద్యారంగ రక్షణే ధ్యేయం

Jan 7,2025 23:35
ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌ పిలుపునిచ్చారు.

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి

ప్రభుత్వ విద్యా రంగం రక్షణే ధ్యేయంగా కదలాలని, దీని కోసం అందరూ నడుం బిగించాలని యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌ పిలుపునిచ్చారు. కాకినాడ పిఆర్‌ కళాశాల ఆవరణలో జరుగుతున్న యుటిఎఫ్‌ స్వర్ణోత్సవ రాష్ట్ర మహాసభలో మంగళవారం మూడోరోజు కొనసాగింది. ఇందులో భాగంగా యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు అధ్యక్షతన ప్రతినిధుల సభను నిర్వహించారు. ఈ సభలో రాష్ట్ర కార్యదర్శి కెఎస్‌ఎస్‌.ప్రసాద్‌ మాట్లాడారు. భవిష్యత్తు కర్తవ్యాలు గురించి వివరించారు. దేశంలో, రాష్ట్రంలో విద్యారంగం ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లో నడుస్తూ, శరవేగంగా కార్పొరేటీకరణ, ప్రయివేటీకరణ జరుగుతుందన్నారు. ఫలితంగా పేదలకు విద్య దూరమయ్యే ప్రమాద పరిస్థితులు ఏర్పడబోతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో విద్యారంగాన్ని కాపాడ్డానికి ప్రతి ఉపాధ్యాయుడు నడుం కట్టాలన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 24 వేల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు సింగల్‌ టీచర్‌ పాఠశాలలుగా మారబోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటులో చట్టం చేయకుండా కేంద్రం తెచ్చిపెట్టిన నూతన విద్యా చట్టం-2020 విద్యా వ్యాపారానికి అనువుగా మారిందన్నారు. ప్రభుత్వ బడులను, ఉద్యోగ ఉపాధ్యాయులను పరిరక్షించుకోవడానికి భవిష్యత్తు ఉద్యమాలకు ఉపాధ్యాయుల సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 16వ విద్యా మహాసభల్లో రాష్ట్ర యుటిఎఫ్‌ సభ్యత్వం 80 వేలు ఉండగా 17వ మహాసభలకు లక్ష పైనే దాటిందని తెలిపారు. యుటిఎఫ్‌ పట్ల ఉపాధ్యాయులకు ఉండే నిబద్ధతకు ఇది ప్రతీక అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంఎల్‌సి ఎంవిఎస్‌.శర్మ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు చైతన్యవంతమై సమా జానికి దిశా నిర్దేశకులు కావాలన్నారు. సోషల్‌ మీడియాకు బానిసలు కారాదన్నారు. దేశంలో పలు రకాల శక్తులు తమ పన్నాగాలను పబ్బం గడుపుకోవడానికి రకరకాల కార్యక్రమాలతో ప్రజల మధ్య విద్వేషాలు పెంచి వారి ఆలోచనలు పక్కదోవకు పట్టించడానికి ప్రయత్నిస్తున్నా యన్నారు. దీన్ని గమనంలో ఉంచుకోవాలన్నారు. దేశ సమగ్రత లౌకిక తత్వం కాపాడుకోవడానికి సాయిశక్తులా కషి చేయాలని పిలుపునిచ్చారు. యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యుటిఎఫ్‌ ఉపాధ్యాయులు సమైక్యంగా ఉండాలన్నారు. పిల్లలను సాంకేతిక దృక్పథంవైపు నడిపించాలన్నారు. పిడిఎఫ్‌ ఎంఎల్‌సి, యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బొర్రా గోపిమూర్తి సంఘం ఆర్థిక నివేదికను ప్రవేశపెట్టారు. ఐక్య ఉపాధ్యాయ పత్రిక నివేదికను ఎన్‌.కుమార్‌రాజా, ఆడిట్‌ కమిటీ నివేదికను రాష్ట్ర కమిటీ అధ్యక్షులు టిఎస్‌ఎల్‌ఎన్‌ మల్లేశ్వరరావు, ప్రచురణల కమిటీ నివేదికను అధ్యక్షులు ఎం.హనుమంతరావు, మహిళా కమిటీ నివేదికను ఎఎన్‌.కుసుమకుమారి, రాష్ట్ర యుటిఎఫ్‌ కుటుంబ సంక్షేమ పథకం నివేదికను ఎస్‌పి.మనోహర్‌ కుమార్‌ ప్రవేశపెట్టారు. వీటిని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తొలుత ఇటీవల మరణించిన పలువురు ప్రముఖులకు సభ్యులు నివాళులర్పించారు. యుటిఎఫ్‌ స్వర్ణోత్సవాల సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లోనూ, యుటిఎఫ్‌ అకాడమిక్‌ అంశాల్లోనూ ప్రతిభ చూపిన వారికి జ్ఞాపికలను అందించారు. సభలో పాల్గొన్న ముఖ్య అతిథిలకు జ్ఞాపికలు అందించారు. అనంతరం జిల్లాల వారీగా సమీక్ష జరిగింది. సాయంత్రం యుటిఎఫ్‌ సాంస్కతిక దళం ఆలపించిన విప్లవ గీతాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కె.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు కె.సురేష్‌ కుమార్‌, ఎన్‌.కుసుమకుమారి, రాష్ట్ర కార్యదర్శులు ఎన్‌.అరుణకుమారి, వి.శ్రీలక్ష్మి, బి.సుభాషిణి, ఎస్‌.కిషోర్‌ కుమార్‌, రెడ్డి మోహన్‌రావు, టి.అన్నారాం, ఎస్‌.జ్యోతిబసు, కాకినాడ జిల్లా యుటిఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.నరేష్‌, పి.చక్రవర్తి, యుటిఎఫ్‌ కృషి రాష్ట్ర పత్రికా బాధ్యులు ఐ.ప్రసాదరావు, చిలుకూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

➡️