ప్రజాశక్తి – కాజులూరు
నిబంధనలు సడలించి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఎపి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని కాజులూరు, శీలలంక గ్రామాల్లో ఆయన పర్యటించారు. తుపాన్ ప్రభావంతో తడిసిపోయిన ధాన్యం రాశులను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కౌలు రైతు నామా చంద్రరావు మాట్లాడుతూ రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యంలో తేమ శాతం 16, 17 ఉంటుందని, అయితే మిల్లుల వద్ద 20 నుంచి 22 శాతం తేమ శాతం చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లా డుతూ తేమ శాతం 20 శాతం ఉన్నా కొనుగోలు చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా అధికారులు చెబుతున్నారని, ఆచరణలో తేమ శాతం 16 ఉండాలని, అలాగైతేనే కొనుగోలు చేస్తామని చెబుతున్నారని అన్నారు. అంతకన్నా ఎక్కువ వస్తే ఒక పాయింట్‌కి ఒక కేజీ కట్ చేస్తున్నారని, దీనివల్ల రైతులు రూ.200 నుంచి రూ.300 వరకూ కోల్పోతున్నారని అన్నారు. పూర్తిగా ఆరుదల ఉన్నప్పటికీ రూ.1630 మాత్రమే ఇస్తున్నారని విమర్శంచారు. ప్రభుత్వం రైతులకు వేస్తానన్న అన్నదాత సుఖీభవ రూ.20 వేలను వెంటనే వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు నామ తాతారావు, ఇయాల ముసలయ్య, చెరువు కొండ, నామా వెంకటేశ్వర్లు, నామా ఆంజనేయులు, నామా రాంబాబు పాల్గొన్నారు.