ప్రజాశక్తి – శంఖవరం
శంఖవరంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేయడాన్ని నిరసిస్తూ గ్రామంలో ఎస్‌సిలు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. తక్షణమే దోషులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్న దళితులకు వైసిపి నాయకులు మద్దతు తెలిపారు. బుధవారం నిరసన శిబిరాన్ని వైసిపి పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు సరమర్ల మధుబాబు సందర్శించారు. అంబేద్కర్ విగ్రహం పట్ల అవమానకర రీతిలో వ్యవహరించిన దోషులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణం దోషులపై చర్యలు తీసుకోకపోతే వైసిపి నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ఆదేశాల మేరకు భవిష్యత్ ఆందోళనకు కార్యాచరణ చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు రాయి శ్రీనివాస్, గంటా భాస్కర్, దళిత సంఘాల నాయకులు ముఖే వీరబాబు, అపురూప్, రాజు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.