కాకినాడ నగరంలో సమస్యలు పరిష్కరించాలి

Mar 26,2025 13:36 #Kakinada district

నగర పాలక సంస్థ కమిషనర్ కార్యాలయం వద్ద సిపిఎం ధర్నా
దోమల నివారణ, డ్రైన్స్ క్లీనింగ్ తక్షణమే చేపట్టాలని డిమాండ్
సమస్యలపై అదనపు కమిషనర్ కు వినతి

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ నగరంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం నగర పాలక సంస్థ కమిషనర్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి అనంతరం అదనపు కమిషనర్ సుధాకర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలలో భాగంగా కాకినాడ నగరంలో మార్చి 11 నుండి 20 వరకు వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను కలుసుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రజలు సిపిఎం దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలను అధికారులకు తెలియచేయడం జరుగుతుందన్నారు. పెన్షనర్స్ ప్యారడైజ్ గా పేరుగాంచిన కాకినాడ దోమల నిలయంగా మారిపోతుందన్నారు. చెత్త సేకరణ కు ఇచ్చిన ప్రాధాన్యత డ్రైన్ క్లీనింగ్ కి లేకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నట్లు చెప్పారన్నారు. నగరంలో సామాన్యుల సొంతింటి కల నెరవేర్చాలని, టిడ్కో గృహాలు నిర్మాణం పూర్తి చేయాలని, స్థలం ఉన్నవారికి హౌసింగ్ లోన్ మంజూరు చేయాలన్నారు. నగరంలో వేసవిలో త్రాగునీటి కొరత లేకుండా చూడాలని, శివారు ప్రాంతాల్లో పరిశుభ్రమైన నీరు అందించాలన్నారు. నగరంలో అవసరమైనచోట మున్సిపల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని, సిసి కేమెరా లు ఏర్పాటు చేయాలని, జిజిహెచ్ పడకల స్థాయి పెంచాలన్నారు. జగన్నాధపురం ఉప్పుటేరుపై 3వ వంతెన నిర్మించాలని, నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలన్నారు. నగర పాలక సంస్థ అధికారులు సాయంత్రం వేళల్లో పేటల్లో పర్యటించాలని కోరుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు కాకినాడ నగర పాలక సంస్థ కు ఎన్నికలు నిర్వహించి ప్రజా పాలన కొనసాగించాలన్నారు. సిపిఎం దృష్టికి వచ్చిన వివిధ ప్రాంతాల సమస్యలను రాతపూర్వకంగా అదనపు కమిషనర్ కు సమర్పించగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు మలక వెంకట, నాగాబత్తుల సూర్యనారాయణ, ప్రసాద్ లతో పాటు మేడిశెట్టి వెంకటరమణ, చంద్రమళ్ళ పద్మ, వెంకట్రావు, కె.సత్తిబాబు, భూలక్ష్మి, భారతి, సత్యానందం, సుధాకర్, సత్యనారాయణ, సురేష్, విజయ్, వసంత్ తదితరులు పాల్గొన్నారు.

➡️