ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి
ఉన్నత చదువుల కోసం జిల్లా కేంద్రం కాకినాడకు వస్తున్న గిరిజన విద్యార్థులకు వసతి కరువైంది. ఇక్కడకు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, అనకాపల్లి జిల్లాల నుంచి వందలాదిగా విద్యార్థులు వస్తున్నారు. చదువుకోవడానికి ఆసక్తి ఉన్నా ప్రభుత్వం హాస్టల్స్ సౌకర్యం కల్పించకపోవడంతో అనేకమంది విద్యకు దూరమవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సరిపడా వసతి గృహాలను స్థానికంగా నిర్మించాలని గిరిజన విద్యార్థులు కోరుతున్నారు. జిల్లా కేంద్రం కాకినాడలో అనేక విద్యాసంస్థలు ఉన్నాయి. జెఎన్‌టియుకెతో పాటు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు, ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటిఐ), ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ వంటి ప్రముఖ కాలేజీలు ఉన్నాయి. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన సుమారు 20 వేల మందికిపైనే ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వీరితో పాటు గిరిజన గ్రామాల నుంచి ఉన్నత విద్య కోసం సుమారు 500 మంది జిల్లా కేంద్రం కాకినాడకు చదువు కోసం వస్తున్నారు. డిగ్రీ ఇంటర్‌తో పాటు వివిధ కోర్సుల్లో చేరిన వారు ఉన్నారు. అయితే జెఎన్‌టియుకె వద్ద ప్రభుత్వ బాలుర ఎస్‌టి హాస్టల్, కర్ణం గారి జంక్షన్ వద్ద ప్రభుత్వ బాలికల ఎస్‌టి హాస్టల్ ఉన్నా వాటిల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేవు. దీంతో పలువురు విద్యార్థులు ప్రయివేటు హాస్టళ్లలో ఉండాల్సి వస్తుది. స్తోమత లేని అనేకమంది ప్రభుత్వ వసతి గృహల్లోనే ఉంటున్నారు. హాస్టల్ ఏర్పాటుపై అనేక సార్లు వినతికాకినాడ శివారున ఉన్న జగన్నాధపురం ప్రాంతంలో ఆంధ్ర పాలిటెక్నిక్, ఎంఎస్‌ఎన్ డిగ్రీ కాలేజ్, ఎంఎస్‌ఎన్ జూనియర్ కాలేజ్, ఉమెన్స్ జూనియర్, ఉమెన్స్ డిగ్రీ కాలేజీలు ఉండగా వీటిల్లో దాదాపు 6 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే కర్ణంగారు జంక్షన్‌లో ఉన్న హాస్టల్ నుంచి జగన్నాధపురం వరకూ సుమారు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి చదుకోవాల్సి వస్తుందని గిరిజన విద్యార్థులు తెలిపారు. దీంతో సమయం వృధా అవుతుండడమే కాకుండా తీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే జెఎన్‌టియుకె వద్ద ఉన్న బాలుర హాస్టల్ నుంచి పిఆర్ జూనియర్, డిగ్రీ, ఒకేషనల్, ఐడియల్, సిబిఎన్ వంటి కళాశాలలకు సుమారు 4 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తుంది. జగన్నాధపురం కేంద్రంగా పలు విద్యాసంస్థలు ఉన్న నేపథ్యంలో అక్కడ ఎస్‌టి బాలికల హాస్టల్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. గిరిజన ఎస్‌టి బాలికల కళాశాల హాస్టల్‌ను ఏర్పాటు చేయాలని గతంలో అనేకసార్లు భారత విద్యార్థి పెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేశారు. నేరుగా గత కలెక్టర్‌ను కలసి సమస్యలను విన్నవించారు. కానీ నేటికీ సమస్య పరిష్కారం కాలేదు. భానుగుడి ప్రాంతంలో ఎస్‌టి బాలుర హాస్టల్‌ను ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.