ప్రజాశక్తి-యు.కొత్తపల్లి : కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో సముద్రపు అలలు బీచ్ రోడ్డుపైకి ఆదివారం ఎగసిపడుతున్నాయి. బంగాళాఖాతంలో తుఫాన్ హెచ్చరికల నేపథ్యం, మరోపక్క పౌర్ణమి కావడంతో కెరటాల ఉధృతి ఎక్కువగా ఉన్నాయి. ఉప్పాడ నుండి ఎస్పీజీఎల్ సమీపం వద్ద వరకు అలల తాకిడి ఎక్కువగా ఉండడంతో రక్షణగా వేసిన రాళ్లు రోడ్డుపైకి చేరుతున్నాయి. దీంతో అటుగా వెళ్లే ప్రయాణికులు భయాందోళనతో పాటు ఇబ్బందులు గురవుతున్నారు. అలల తీవ్రత ఎక్కువగా ఉండడంతో మాయా పట్నం, సూరాడు పేట గ్రామాల మత్స్యకారుల గృహాల్లోకి అలలు దూసుకొస్తున్నాయని మత్స్యకారులు తెలుపుతున్నారు. ఇదే పరిస్థితి నెలకొంటే పలు గృహాలు సముద్ర గర్భంలో కలిసిపోవడం తద్యమని తెలుపుతున్నారు. ఇప్పటికే అనేక గృహాలు అలల తాకిడికి నేలమట్టం అయ్యాయని సముద్ర పలల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని తీర ప్రాంత గ్రామస్తులు కోరుతున్నారు.
