ప్రజాశక్తి- రావులపాలెం, కడియం
జిల్లాలో చిరుత కలకలం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. 25 రోజుల క్రితం దివాన్‌చెరువు అటవీ ప్రాంతంలోని దూరదర్శన్ కేంద్రం కార్యాలయం ఆవరణలో చిరుత అడుగుజాడలను తొలిసారిగా అధికారులు గుర్తించారు. తాజాగా ఈ చిరుత కడియం మండలం బుర్రిలంకలో సంచరిస్తున్నట్లు ఇటీవల అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. ప్రస్తుతం మూడు రోజులుగా ఇక్కడ చిరుత జాడ కానరాలేదు. గోదావరి లంకల్లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అక్కడ పరిశీలించిన అధికారులు అక్కడ కూడా చిరుత జాడలు ఏవీ కనిపించలేదని స్పష్టం చేశారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళనలోనే జీవిస్తున్నారు. జిల్లాలో సంచరిస్తున్న చిరుత సమీపంలో ఉన్న మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చిందని అధికారులు అభిప్రాయపడ్డారు. కాని నేటికీ దీన్ని ధ్రువీకరించలేదు. ఒక్కటే వచ్చిందా..? లేక జంటగా వచ్చిందా..? అనే అనుమానం కూడా వ్యక్తమైంది. అయితే 15 రోజుల తరువాత ఒక చిరుత మాత్రమే వచ్చినట్టు వారు నిర్ధారణకు వచ్చారు. కడియం మండలంలోని బుర్రిలంకలోని ఒక నర్సరీలో చిరుతపులి పాదముద్రలను గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు, సోలార్ సిసి కెమెరాలను అమర్చి గాలింపు చేపట్టారు. ట్రాప్ బోన్‌లను సైతం ఏర్పాటు చేశారు. కాని ఎక్కడ చిరుత జాడ కానరాలేదు. గత నాలుగు రోజులుగా ఎలాంటి జాడ కనిపించలేదని కోనసీమ జిల్లా ఫారెస్టు అధికారి ఎంవీ ప్రసాదరావు స్పష్టం చేశారు. గత నెల 28న గోదావరి లంకల్లో చిరుతను చూశామని కొంత మంది మత్స్యకారులు తెలిపారన్నారు. దీంతో ఆ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో పరిశీలించామని, బోటులో వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించామని అక్కడ కూడా చిరుతకు సంబంధించి ఎలాంటి జాడ కనిపించలేదని ఆయన స్పష్టం చేశారు. అక్కడ చిరుత లేదని తెలిపారు. దీంతో అటు కోనసీమ, ఇటు తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.అధికారుల విఫయత్నం చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు విఫలయత్నం చేస్తున్నారు. దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్టులో 70 ట్రాప్ కెమెరాలను అమర్చి చిరుత కదలికలను పరిశీలిస్తూ వచ్చారు. దాన్ని బంధించేందుకు 7 బోన్‌లను కూడా అమర్చారు. తాజాగా చిరుత దిశ మార్చడంతో కడియంలో 20 ట్రాప్ కెమెరాలు, 5 సోలార్ బేస్డ్ సిసి కెమెరాలను అమర్చారు. రెండు బోనులను అక్కడ కూడా అమర్చారు. ప్రస్తుతం 5 బృందాలు గాలిస్తున్నాయి. 60 మంది అటవీ సిబ్బంది డ్రోన్లతోనూ జల్లెడ పడుతున్నారు. కాని ఇప్పటి వరకూ చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. అధికారుల ప్రణాళికలకు అనుగుణంగా బోనులోకి వెళ్తే సరే లేకుంటే మేకపై దాడి చేస్తే తగు జాగ్రత్తలు తీసుకుని మత్తు ఇంజక్షన్ ఇచ్చేందుకు సైతం సిద్ధపడినా చిరుత జాడ లేక అంతా అయోమయంలో పడ్డారు. ప్రజల్లో ఆందోళన జిల్లాలో చిరుత సంచారంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. వర్షాకాలంలో మొక్కల ఎగుతమలు దిగుమతులు అధికంగా జరుగుతుంటాయి. నర్సరీల మధ్యగా చిరుత సంచారం నేపథ్యంలో కూలీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు 4 వేల ఎకరాల్లో ఉన్న నర్సరీల్లో 30 వేలకు మందిగా కూలీలు పనిచేస్తున్నారు. నర్సరీలను అనుకునే జనావాసాలు కూడా ఉండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ప్రస్తుతం చిరుత సంచారంతో కొంత మంది కూలీలు పనులకు కూడా వెళ్లడం లేదు. కంగారు పడొద్దుచిరుతపులి కనిపిస్తే కంగారు పడి పరిగెట్టరాదని డిఎఫ్‌ఒ సూచించారు. నిజంగా పులి ఎదురుపడితే దాన్ని చూస్తూ చేతులు పైకి ఎత్తి బిగ్గరగా అరుస్తూ వెనుకు మరలాలన్నారు. జాగ్రత్తగా అక్కడ నుంచి తప్పుకోవాలన్నారు. తనకంటే ఎత్తయిన జంతువులు, మనుషులపైకి చిరుత దాడి చేయదని తెలిపారు. కంగారు పడి పరిగెడితే దాడి చేస్తుందని సూచించారు. బయట ఒంటరిగా తిరుగరాదని, గుంపులుగా వెళ్లాలని, కర్ర టార్చ్ లైట్‌తో బయటకు వెళ్లాలని సూచించారు. గోదావరి పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.అసత్య ప్రసారాలు చేస్తే చర్యలు చిరుతపులి విషయంలో అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. గోదావరి లంకల్లో సిబ్బంది బృందాలుగా ఏర్పడి అన్వేషణ కొనసాగిస్తున్నామని తెలిపారు. కడియం నర్సరీలలో పనిచేసే వారికి చుట్టు పక్కల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశామన్నారు. చిరుత కోసం గాలింపు చేపడుతూనే మరో పక్క తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.