ఇదేం బాదుడు బాబూ…

Dec 13,2024 22:49

ప్రజాశక్తి – యంత్రాంగం సాధారణంగా విద్యుత్‌ వాడకం తగ్గితే బిల్లులో తగ్గుదల కనిపిస్తుంది. కాని నవంబర్‌, డిసెంబర్‌ నెలల బిల్లుల్లో యూనిట్లు తగ్గినా విద్యుత్‌ ఛార్జీలు మాత్రం పెరిగిపోయాయి. కారణం సర్‌ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలే. వాడుకున్న కరెంటు కంటే ఈ అదనపు ఛార్జీలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వాడుకున్న దానికంటే రెండు మూడు రెట్లు అదనంగా కరెంటు బిల్లులు రావడంతో ‘ఈ బాదుడు మేం తట్టుకోలేం బాబూ’ అంటూ గగ్గోలు పెడుతున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సంలో వాడుకున్న కరెంటకు సంబంధించి ఎప్‌పిపిసిఎ ఛార్జీలను ప్రస్తుతం వసూలు చేస్తున్నారు. ఎఫ్‌పిపిసిఎ, ఎఫ్‌పిపిసిఎ2 పేరుతో ఇవి ప్రస్తుత బిల్లుతో వస్తున్నాయి. సర్‌ఛార్జీలతో కలిసి వీటిని వసూలు చేయడంతో ప్రతి విద్యుత్‌ వినియోగదారునిపై ఈ భారం పడుతుంది. 15 నెలల పాటు ఈ భారం పడనుంది. నవంబర్‌లో ఎఫ్‌పిపిసిఎ ఛార్జి వసూలు చేయగా డిసెంబర్‌లో ఎఫ్‌పిపిసిఎ2ను కూడా కలిపి వసూలు చేస్తున్నారు. ఒక్కో కుటుంబం పై రూ.100 నుంచి రూ.500 వరకూ అదనపు భారం పడుతుంది. తాము అధికారంలోకి వస్తే విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని హామీలు గుప్పించిన కూటమి నేతలు నేడు అధికారంలోకి వచ్చిన ఆరునెలలకే సర్దుబాటు ఛార్జీల పేర భారం మోపడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం బాదుడు బాబూ అంటూ నోళ్లు వెళ్లదీస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్‌ ధవళేశ్వరం గ్రామానికి చెందిన ఎన్‌.ఆదిలక్ష్మి కుటుంబం ఎర్రకొండపై నివాసం ఉంటోంది. ఆమె ఇంటికి సంబంధించి కరెంటు బిల్లు ఎప్పుడూ రూ.250 మించి రాదు. డిసెంబర్‌ బిల్లులో 66 యూనిట్ల కరెంట్‌ను వాడుకున్నట్టు చూపారు. కాని బిల్లు మాత్రం రూ.894 రావడంతో అవాక్కైంది.66 యూనిట్లకు ఎనర్జీ ఛార్జి 189.18 కాగా ఫిక్స్‌డ్‌ ఛార్జి రూ.10, కస్టమర్‌ ఛార్జి రూ.30, ఇడి ఛార్జి రూ.3.96, సర్‌ఛార్జి రూ.25, ఎఫ్‌పిపిసిఎ రూ.153, ఎఫ్‌పిపిసిఎ2 కింద మరో రూ.105, ఎఎఫ్‌టి పేరుతో రూ.401 వేశారు. వెరసి మొత్తం బిల్లు రూ.894 వేయడంతో ఆమె లబోదిబోమంటుంది. వాడుకున్న కరెంటుకు నాలుగు రెట్లు ఛార్జీ వేశారని వాపోతోందివినియోగం తగ్గినా అదనంగా బిల్లులుచెముడులంకుకు చెందిన తమ్మన శ్రీనివాస్‌కు నవంబర్‌ నెలకు సంబంధించి 190 యూనిట్లకు రూ.950 బిల్లు వచ్చింది. డిసెంబర్‌లో కరెంటు వాడకం తగ్గింది. డిసెంబర్‌లో 187 యూనిట్లు మాత్రమే వాడుకున్నారు. డిసెంబర్‌లో రూ.1,048 బిల్లు వచ్చింది. గతనెల కంటే మూడు యూనిట్లు తగ్గినా కరెంటు బిల్లు తగ్గక పోగా గత నెలకంటే అదనంగా రూ.98 వచ్చింది. డిసెంబర్‌ నెలలో సర్‌ఛార్జి రూ.25, ఎఫ్‌పిపిసిఎ రూ.86, ఎఫ్‌పిపిసిఎ2 ఛార్జి రూ.76 అదనంగా వచ్చింది. వాడుకున్న కరెంటు కంటే రూ.187 అదనంగా చెల్లించాల్సి వచ్చింది. దీనిపై శ్రీనివాస్‌ మాట్లాడుతూ విద్యుత్‌ భారాలు వేయబోమని చెప్పి ఇప్పుడు ఇలా అడ్డగోలుగా భారాలు వేయడం సబబు కాదన్నారు.79 యూనిట్లకు రూ.986డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంకలో కె.నాగేశ్వరావు కుటుంబం నివాసం ఉంటోంది. నవంబర్‌ నెలలో వీరింటికి 70 యూనిట్లకు రూ.832 బిల్లు వచ్చింది. ఇందులో సర్‌ఛార్జి రూ.150, ఎఫ్‌పిపిసిఎ2 ఛార్జి రూ.34 వేశారు. డిసెంబర్‌లో 79 యూనిట్ల కరెంట్‌ వాడుకున్నారు. దీనికి రూ.986 బిల్లు వచ్చింది. ఇందులో సర్‌ఛార్జి రూ.150, ఎఫ్‌పిపిసిఎ 72, ఎఫ్‌పిపిసిఎ2 ఛార్జి రూ.34 వేశారు. యూనిట్ల పరంగా వాడుకున్న 79 యూనిట్లకు రూ.491.85 అయితే అదనంగా రూ.494.15 పడింది. అసలు వాడుకున్న దానికంటే కొసరు ఛార్జీలే అధికంగా ఉండటంతో లబోదిబో మంటున్నాడు. 32 యూనిట్లు తగ్గినా బిల్లులో మాత్రం మార్పు లేదుఆలమూరు మండలంలోని మడికిలో గంగిశెట్టి దొరబాబు నివాసం ఉంటున్నారు. ఆ ఇంటికి అక్టోబర్‌ నెలకు కరెంటు బిల్లు 215 యూనిట్లగాను 1139 రూపాయలు వచ్చింది. అలాగే డిసెంబర్‌ నెల విద్యుత్‌ బిల్లు 183 యూనిట్లకు గాను 1138 రూపాయలు వచ్చింది. అయితే విద్యుత్‌ వినియోగం తగ్గిన బిల్లు యధాతధంగా రావడంతో వారు ఆవేదన చెందుతున్నారు.

➡️