ప్రజాశక్తి – యంత్రాంగం
పిఠాపురం జనసేన పార్టీ 14వ ఆవిర్భావ ‘జయకేతనం’ సభ నేడు చిత్రాడ గ్రామంలోని ఎస్‌బి వెంచర్‌లో జరగనుంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఈ సభను భారీ స్థాయిలో జరిపేలా ఏర్పాట్లు చేశారు. వివిధ నిర్వహణ కమిటీలను వేసి బాధ్యతలు అప్పగించారు. సభ ప్రాంగణం డెకరేషన్, వేదిక ఏర్పాట్లను సైతం పూర్తి చేశారు. దూర ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చే వారికి కోసం పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా మంచినీరు, మజ్జిగ, ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 7 వైద్య శిబిరాలు, 14 అంబులెన్సులను అందుబాటులో ఉంచారు. జయకేతనం సభకు పార్టీ మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలతోపాటు, రాష్ట్ర నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి సైతం అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున రానుండటంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు1600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 75 సిసి కెమెరాలు, రోడ్డుకు ఇరువైపులా, సభ ప్రాంగణంలో ఎల్‌ఇడి స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నాయకుల ఉపన్యాసాలు ఉంటాయి. సాయంత్రం జనసేన అధినేత, ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటారని నిర్వాహకులు తెలిపారు. కాకినాడ – కత్తిపూడి మధ్య గల 216వ జాతీయరహదారిపై శుక్రవారం ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకూ ట్రాఫిక్‌ని మల్లించారు. సభకు వచ్చే వారికి ఎక్కడికక్కడ మంచినీరు, మజ్జిగ వంటివి అందించేందుకు వాలంటీర్లను ఏర్పాటు చేశారు.ఆవిర్భావ దినోత్సవానికి తరలిరావాలి యు.కొత్తపల్లి చిత్రాడలో శుక్రవారం నిర్వహిస్తున్న జనసేన ఆవిర్భావ దినోత్సవానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని పిఠాపురం జనసేన జనసేన నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, వి.ధనబాబు గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సభలో డిప్యూటీ సిఎం, పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తోపాటు, ఇతర ముఖ్యనేతలు పాల్గొంటారని, కావున ప్రజలు పెద్దఎత్తున పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు. కాజులూరు నేడు చిత్రాడలో జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జనసేన నాయకులు, ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ డేగల నాగేంద్ర గురువారం ఒక ప్రకటనలో కోరారు. మండలం నుంచి జనసేన ఆవిర్భావ దినోత్సవానికి వెళ్లే ప్రతి కార్యకర్తకు తన వంతుగా పెట్రోల్ కూపాన్ అందజేస్తున్నట్లు చెప్పారు. కూపన్ తీసుకుని గొల్లపాలెంలో పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించుకోవాలని ఆయన కోరారు.