ప్రజాశక్తి – పిఠాపురం
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని సిపిఎం మండల కన్వీనర్ కె.చిన్న విమర్శించారు. సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా, విభజన హామీలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. మధ్యతరగతి ప్రజలకు ఇన్‌కం టాక్స్ పరిధిని పెంచడం తప్ప బడ్జెట్‌లో ఏమీ లేదన్నారు. కేంద్ర విద్యా సంస్థలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు నిధులు కేటాయించలేదన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ, ఉపాది హామి పథకానికి నిధులు కేటాయింపులు లేవన్నారు. గత బడ్జెట్ కంటే స్కీం వర్కర్లకు రూ.5 వేల కోట్లు తగ్గించిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టిన కూటమి ప్రభుత్వ పెద్దలు ఢిలీ ఎన్నికల్లో బిజెపికి ఓట్లు వేయాలని కోరడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్రం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కోనేటి రాజు, కె.మణి, నాగేశ్వరరావు, జి.వీరబాబు, సూర్యనారా యణ, స్టాలిన్, శ్రీను, రాజేష్, వి.నాగు పాల్గొన్నారు.