ప్రజాశక్తి – కాకినాడ
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వడ్డె ఓబన్న చేసిన పోరాటం ఆదర్శనీయమని కలెక్టర్ షాన్ మోహన్ సగలి అన్నారు. శనివారం బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలక్టరేట్‌లో ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1857లో దేశంలో బ్రిటిష్ పాలన వ్యతిరేకంగా జరిగిన ప్రతి ఘటనలో వడ్డే ఓబన్న ముఖ్యపాత్ర పోషించారన్నారు. స్వతంత్ర సంగ్రామంలో ఒక అధ్యాయంగా నిలిచి, వడ్డే ఓబన్నలోని ప్రజాస్వామ్య విలువలు, ధైర్య సాహసలను ప్రజలకు తెలియ చేయాలనే లక్ష్యంతో ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిచాలని నిర్ణయించిం దన్నారు. 1807 సంవత్సరం, జనవరి 11న నంద్యాల జిల్లా, సంజమల మండలంలో నొస్సం గ్రామంలో జన్మించిన వడ్డే ఓబన్న బ్రిటిష్ పాలకుల నుంచి పేద రైతులు, గ్రామస్తులు హక్కులను కాపాడటంలో అసమానమైన పోరాటం చేశారన్నారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటంలో వడ్డే, బోయ, యానాది, చెంచు వంటి ఇతర సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులను భాగస్వామ్యం చేసుకుని ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా వడ్డెర సంఘంలో ఆయనకున్న గౌరవం మరింత పెరిగి, బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడిగా, సామాన్యుల హక్కులు కోసం చేసిన పోరాటంలో గొప్ప నాయకుడిగా గుర్తింపు పొందారని ఆయన కొనియాడారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చేసిన స్వాతంత్ర పోరాటంలో ధైర్య సహసాలు, ప్రజా ప్రయోజనం కోసం చేసిన కృషి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ అధికారి ఎం.లల్లి, బిసి సంక్షేమ శాఖ సహాయ అధికారి తేజోమూర్తుల వీరభద్రప్రసాద్, కార్యాలయ పర్యవేక్షకులు గోవాల సతీష్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.