ఉద్రిక్తతల నడుమ వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక వాయిదా

Feb 3,2025 22:53
ఉద్రిక్తతల నడుమ వాయిదా పడింది.

ప్రజాశక్తి – తుని

తుని మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతల నడుమ వాయిదా పడింది. సోమవారం ఉదయం 10 గంటలకు మున్సిపల్‌ ఛైర్మన్‌ ఏలూరు సుధారాణి కౌన్సిలర్లతో కలిపి మున్సిపాలిటీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. తుని మున్సిపాలిటీ పరిధిలో 30 మంది కౌన్సిలర్లూ వైసిపికి చెందిన వారే ఉన్నారు. వీరు లోనికి వెళ్తండగా టిడిపి నాయకులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. వారి తీరుపై ఛైర్మన్‌ సుధారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసిపి ఛైర్మన్‌, కౌన్సిలర్లు నినాదాలు చేశారు. ఇదే సమయంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు వైసిపికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు కలుగజేసుకుని మున్సిపల్‌ కార్యాలయంలోకి రానివ్వకుండా గేట్లు మూసేశారు. 10 గంటల నుంచి 11 గంటల వరకు గేటుబయటే నిలబెట్టడంతో మున్సిపల్‌ ఛైర్మన్‌ సుధారాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం గేట్లు తీశారు. తొలుత టిడిపి నాయకులను లోనికి అనుమతించారు. అనంతరం ఛైర్మన్‌, కౌన్సిలర్లు లోనికి వెళ్లారు. లోపల కూడా ఇరువురు నినాదాలను చేశారు. పోలీసుల జోక్యంతో పరిస్థితిని చక్కదిద్దారు. కాని ఎన్నికల అధికారులు మాత్రం రాలేదు. నోటీసు బోర్డులో ఎన్నికలు వాయిదా వేసినట్టు అధికారులు ప్రకటించారు.

➡️