నిబంధనలకు తూట్లు..!

Jun 9,2024 23:22
విద్యా సంవత్సరం ప్రారంభానికి

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రతి ఏటా పలు ప్రయివేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగా వివిధ రూపాల్లో సొమ్ములు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే రూ.వేలల్లో ఫీజుల రూపంలో బాదేస్తుండగా విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తూ విద్యాసంస్థల్లోనే పుస్తకాలను విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఒకటి నుంచి 10వ తరగతి వరకూ పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలకు కలిపి రూ.7 వేలు నుంచి రూ.15 వేలు వరకూ ఖర్చు చేయాల్సి వస్తుందని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా యాజమాన్యాల వద్దే తప్పనిసరిగా కొనుగోలు చేయాలనే అనధికారిక నిబంధనలు పెడుతుండడంతో భారంగా మారుతోందని చెబుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ప్రయివేటు విద్యాసంస్థలు పాఠ్యపుస్తకాలను విక్రయించాలని నోట్‌ పుస్తకాలు, ఇతర వస్తువులు అమ్మరాదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నా యాజమాన్యాలు పెడ చెవినే పెడుతున్నాయి.ఇష్టారాజ్యంగాప్రభుత్వ పాఠశాలలో 1నుంచి 10వ తరగతి వారికి ఉచితంగా, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రయివేటు పాఠశాలలకు తరగతుల వారీగా ప్రభుత్వం గతేడాది పుస్తకాల ధరలను నిర్ణయించింది. ఈ ఏడాది ఇంకా ప్రకటన రాలేదు. 1 నుంచి 10వ తరగతి వరకు తెలుగు మీడియంకు రూ.326 నుంచి 657 వరకూ, ఇంగ్లీషు మీడియంకు రూ.280 నుంచి 674 వరకూత మాత్రమే పాఠ్యపుస్తకాలను విక్రయించాల్సి ఉంది. కానీ పలు యాజమాన్యాలు విద్యాహక్కు చట్టాన్ని పక్కన పెట్టి భారీగా ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల జేబులను ఖాళీ చేస్తున్నాయి. అదే సందర్భంలో పుస్తకాలను తమ వద్దే కొనుగోలు చేయాలని తేల్చి భారీగా ధరలు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. నోట్‌ బుక్స్‌, షూస్‌, టై, యూనిఫామ్‌ ఇలా విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు అక్కడే కొనుగోలు చేయాలని చెబుతూ భారీగా దండుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు 10 నుంచి 20 శాతం అదనంగా పుస్తకాల కోసం వసూలు చేస్తున్నారు.పట్టని విద్యాశాఖ జిల్లాలో పలు ప్రయివేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు భారీగా ఫీజులు, డొనేషన్లు వసూలు చేస్తుండడమే కాకుండా పుస్తకాల పేరుతో వేలల్లో సొమ్ములు గుంజుతున్నా విద్యాశాఖ అధికారులు కనీసంగా పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఫిర్యాదులు అందిస్తున్నా తూతూ మంత్రపు చర్యలతో సరిపెడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరమైనా విద్యా హక్కు చట్టం పూర్తిస్థాయిలో అమలయ్యేలా అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

అధికారుల చర్యలు శూన్యం

విద్య హక్కు చట్ట ప్రకారం ప్రయివేట్‌ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ అమ్మకాలు చేయకూడదు. కానీ చాలా పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, స్టేషనరీ అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. ఏ పాఠశాల పేరు మీద ఆ పాఠశాల పుస్తకాలనే అమ్ముతూ తమ పాఠశాలల్లోనే పాఠ్యపుస్తకాలు కొనాలని తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారు. ఇది సరికాదు. వెంటనే అధికారులు సరైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఆందోళన చేపడతాం.

ఎం.సూరిబాబు, ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి, కాకినాడ జిల్లా

➡️