ప్రజాశక్తి-కాకినాడ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షలు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను 32 మంది విద్యార్థుల ప్రాణ త్యాగాలతో, 67 మంది ఎంపీల రాజీనామాలతో, 30 గ్రామాల రైతుల 32 వేల ఎకరాల భూముల త్యాగంతో సాధించుకున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలలో ఉత్పాదకత ఉండదని, సామర్థ్యం మేరకు ఉద్యోగులు పనిచేయరని ప్రచారం చేస్తున్న కార్పొరేట్, భుర్జువా మేధావులు విశాఖ ఉక్కు పరిశ్రమలో తయారయ్యే నాణ్యమైన ఉక్కును ప్రెవేటు ఉక్కు సంస్థలు ప్రజలకు ఎందుకు అందించలేకపోతున్నాయో సమాధానం చెప్పాలన్నారు. సొంత గనులు లేకపోయినా ముడిసరుకు అవసరం మేరకు అందించిన సంవత్సరంలో 120 శాతం సామర్థ్యంతో పనిచేయటం కనిపించలేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీరావేశంతో జగన్ ప్రభుత్బంపై విరుచుకు పడిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇప్పుడు ఉక్కు పరిశ్రమలోని 4 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ప్రవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యోగులను ఇతర రాష్ట్రాలకు బలవంతపు ట్రాన్స్‌ఫర్స్ చేస్తుంటే ఉద్దేశపూర్వకంగా మౌనం ఎందుకు వహిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. పరిశ్రమలే పెట్టని ప్రెవేటు సంస్థలకు ఇనుప ఖనిజం కేటాయిస్తూ, ప్రజల సంపదతో నిర్మించిన, త్యాగలతో సాధించుకున్న విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించకుండా నష్టాలొస్తున్నాయని, సెంటిమెంటుతో ఆలోచించకూడని చెప్పటం మానుకోవాలని హెచ్చరించారు. బిజెపి విధానాలను వంటబట్టించుకుని ఆంధ్రా ప్రజలను మత ప్రాతిపదికన విడదీసేందుకే ఆధారాలు చూపలేని లడ్డు కల్తీ వ్యవహరాన్ని తెరమీదకు తీసుకువచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నలతో స్పష్టమవుతోందన్నారు. ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి రాజు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుబండి చంద్రావతి, ఎఐసిసిటియు రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి గుబ్బల ఆదినారాయణ ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్ష కార్యదర్శులు సంజరు, వాసు, రూరల్ కమిటీ సభ్యుడు రోహిత్, పౌర సంక్షేమ సంఘం అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు, మద్యపాన నిషేధ కమిటీ నాయకులు సూర్యనారాయణ, నర్సింగ్ స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, హ్యూమన్ రైట్స్ నెంబర్ ఎన్.అప్పారావు దీక్షకు మద్దతు తెలిపారు.