ఓటుకు నోటు కోసం రోడ్డెక్కిన ఓటర్లు

May 12,2024 22:39
తమ గ్రామంలో నెలకున్న సమస్యలను

ప్రజాశక్తి – యు.కొత్తపల్లి

తమ గ్రామంలో నెలకున్న సమస్యలను పరిష్కరించాలని రోడ్డెక్కి ఆందోళన చేయడం చూశాం. లేదంటే తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరసన వ్యక్తం చేయడమూ చూశాము. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు చేపట్టిన నగదు పంపిణీ తమకు అందలేదంటూ ఓటర్లు ఆందోళనకు దిగడం చర్చానీయాంశంగా మారింది. మండలంలోని కొండవరం గ్రామంలో ఆదివారం ఉదయం పిఠాపురం, ఉప్పాడ ప్రధాన రోడ్డుపై మహిళలు, యువకులు ధర్నా చేపట్టారు. అధికార వైసిపి ఒక్కో ఓటుకు రూ.3 వేలు చొప్పున పంపిణీ చేసిందని, అయితే తమకు అందలేదని, నగదు పంపిణీలో తమను పక్కన పెట్టడాన్ని నిరసిస్తూ రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా పెద్దఎత్తున చర్యలు తీసుకున్నామని ఎన్నికల అధికారులు చేసిన ప్రకటన ఆచరణలో ఎక్కడా కన్పించిన దాఖలాలు లేకుండా పోయాయి. అధికార వైసిపి, జనసేన పార్టీలకు చెందిన నాయకత్వం పోటాపోటీగా ఓటు కోసం నోట్ల కట్లను పంపిణీ చేశారు. యథేచ్ఛగా రాత్రి, పగలు అని తేడా లేకుండా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికార వైసిపి, జనసేన పార్టీల నాయకులు పనిచేశారు. అయితే ఓటుకు నోటును అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

➡️