ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి రైతుల సంక్షేమం కోసమే తామ ప్రభుత్వం పని చేస్తుందన్నట్లుగా పాలకులు గొప్పలు చెబుతున్నప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తాత్కాలిక పద్ధతిలో నియమించిన సిబ్బందికి మాత్రం వేతనాలు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గత ఖరీఫ్ సమయంలో ధాన్యం సేకరణలో కీలకంగా వ్యవహరించిన సిబ్బందికి రబీ సీజన్ వచ్చినప్పటికీ మూడు నెలల జీతాలు ఇవ్వలేదు. ఇచ్చేది అరకొర వేతనమే అయినా వాటితోనే కుటుంబాలను పోషించుకునే వీరి పరిస్థితి ప్రస్తుతం ఆగమ్య గోచరంగా మారింది. ఇప్పుడు రబీ సీజన్‌లో ధాన్యం సేకరణ కోసం ఆకలితో అలమటిస్తూ ఎలా పని చేయాలంటూ సిబ్బంది ఈ సందర్భంగా అధికారుల తీరుని ప్రశ్నిస్తున్నారు.జిల్లాలో ప్రధానంగా వరి పండించే రైతులు ఎక్కువగా ఉన్నారు. ధాన్యం దళారుల పాలు కాకుండా గిట్టుబాటు ధర కల్పించడం కోసం ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో మెజారిటీ ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. దళారీ వ్యవస్థను అరికట్టేందుకు కొనుగోలు కేంద్రాలు ఎంతో ఉపయోగ పడున్నాయన్నట్లుగా ప్రభుత్వం చెప్పుకొస్తోంది. ఈ నేపథ్యంలో రైతుల సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ముగ్గురు సిబ్బందిని నియమిస్తున్నారు. ఒక టెక్నికల్ అసిస్టెంట్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఒక సహాయకుడు పని చేస్తున్నారు. టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.15 వేలు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.12 వేలు, హెల్పర్‌కు రూ.9 వేలు జీతంగా ఇస్తున్నారు. ఈ మూడు కేటగిరీల్లో జిల్లాలో 280 మంది చొప్పున మొత్తం 840 మందిని నియమించారు. వీరికి గత ఖరీఫ్ సీజన్లో పని చేసినందుకు అక్టోబర్, నవంబర్, డిసంబర్ నెలలకు సంబంధించిన వేతనాలు నేటికీ అందలేదు. మొత్తం రూ.30.01 లక్షల జీతాలు పేరుకుపోయాయి.అష్టకష్టాలు పడుతున్న సిబ్బందిగత ఖరీఫ్ సీజన్లో మూడు నెలల పాటు కొనుగోలు కేంద్రాలలో పని చేసిన సిబ్బందికి ప్రభుత్వం వేతనాలు నేటికీ విడుదల చేయకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకునే పరిస్థితికి దిగజారారు. మూడు నెలలు గడిచిపోయినప్పటికీ ఒక రూపాయి కూడా వేతనం విడుదల కాలేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమను ఆదుకోవాలని సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు.కేంద్రాల్లో కనిపించని సిబ్బందిప్రస్తుతం రబీ సీజన్ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా యంత్రాల సాయంతో ముమ్మరంగా కోతలు జరుగుతున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా అన్నదాతలు ధాన్యాన్ని అమ్ముకునేందుకు తొందరపడుతున్నారు. ఈ నెల 3 నుంచి 225 ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాలకు వెళుతుంటే ప్రభుత్వ నిర్వాకంతో అక్కడ సిబ్బంది కనిపించని పరిస్థితుల్లో దళారులకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం 75 కిలోల ఎ గ్రేడ్ రకానికి రూ.1740 మద్దతు ధర కల్పిస్తోంది. అయితే ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలు అక్కరకు రాకపోవడంతో రూ.1200 నుంచి 1400కే అమ్ముకుంటున్న పరిస్థితి ఏర్పడింది. వారం రోజులు గడచినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కొనుగోళ్ళు నామమాత్రంగానే ఉన్నాయి. గురువారం కేవలం 6 కేంద్రాల ద్వారా 23 మంది రైతుల నుంచి 261 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయగలిగారు. సిబ్బందికి వేతనాలు విడుదల చేయకపోవడంతో కొనుగోలు కేంద్రానికి వెళ్లేందుకు అయిష్టత చూపుతున్నట్టు తెలుస్తోంది. అందుచేత రైతులు కేంద్రాలకు వెళుతున్నా సిబ్బంది ఎవరు కనిపించని నేపథ్యంలోనే ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవాల్సి వస్తుంది. కావున ప్రభుత్వం వెంటనే వారికి వేతనాలు చెల్లించి కొనుగోలు కేంద్రాల్లో పూర్తిస్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులకు కోరుతున్నారు.
