ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని తూర్పు, మధ్య డెల్టా పరిధిలో ఉన్న 36 మండలాల్లో ఉన్న 1600 గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛ తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం ‘వాటర్ గ్రిడ్’ పథకాన్ని తీసుకొచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని రూపొందించారు. కానీ వైసిపి సర్కారు ఒక రూపాయి కూడా కేటాయించలేదు. ఐదేళ్లు గడిచిపోయి అధికారం కోల్పోయింది. దీంతో ఈ పథకం మూలకు చేరింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటర్ గ్రిడ్ పథకాన్ని తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 9 నెలలు గడుస్తున్నప్పటికీ ఈ పథకంపై కూటమి ప్రభుత్వంలోనూ ఒక్క అడుగు ముందుకు పడడం లేదు. దీంతో శుద్ధ జలం కోసం ఎదురుచూస్తున్న సాధారణ ప్రజానీకానికి నిరీక్షణ తప్పడం లేదు. ఈ పథకం ఎప్పటికీ అమలవుతుంది? ఎప్పుడు పనులు ప్రారంభమవుతాయి..? ఎప్పటికీ పూర్తవుతాది? అనే ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఇదీ ప్రణాళికగోదావరి నీటిని శుద్ధిచేసి పైపులైను ద్వారా మళ్లించి ఇంటింటికి కుళాయి ద్వారా రోజుకి ఒక మనిషికి 55 లీటర్ల శుద్ధమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును తీసుకొచ్చారు. 2054 సంవత్సరం వరకు గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాల కోసం ప్రణాళికను సిద్ధం చేశారు. ధవలేశ్వరం బ్యారేజి ద్వారా 2.153 టిఎంసిల గోదావరి నీటిని ఫిల్టర్ చేసి తూర్పు డెల్టాలోని 511 ఆవాస ప్రాంతాల పరిధిలోని 10.31 లక్షల మందికి, మధ్య డెల్టాలో 1100 ఆవాస ప్రాంతాల్లో 10.49 లక్షల మందికి నీరు అందివ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఆత్రేయపురం మండలం వెలిచేరు, కడియం మండలం జేగురుపాడులలో ఫిల్టర్ ప్లాంట్లను నిర్మిస్తారు. బొబ్బర్లంక, ధవళేశ్వరంలలో ఇంటెక్ వెల్స్‌ను ఏర్పాటు చేస్తారు. గోదావరి నీటిని ఇంటెక్ వెల్స్ ద్వారా పంపింగ్ చేసి ఫిల్టర్ ప్లాంట్ లకు పంపుతారు. అక్కడ ఫిల్టర్ అయినా తాగునీటిని పైపులైను ద్వారా నిర్దేశించిన ప్రాంతాలకు కుళాయిల ద్వారా స్వచ్ఛ నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికను రూపొందించారు. కేంద్రం 50, రాష్ట్రం 50 శాతం నిధులుకేంద్రం 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం మరో 50 శాతం నిధులను ఈ ప్రాజెక్టుకు కేటాయించాల్సి ఉంది. మొత్తంగా రూ.1650 కోట్ల నిధులతో దీనిని నిర్మించాలని భావించారు. గత ప్రభుత్వం హయాంలో కేంద్రాన్ని వైసిపి సర్కారు నిధులను అడగలేక పోయింది. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించేందుకు కనీస ప్రయత్నం చేయలేదు. దీంతో ఈ పనులు ప్రారంభం కాని పరిస్థితి నెలకొంది. దీంతో నేటికీ ఈ పథకం పట్టాలెక్కలేదు. ఎన్‌డిఎ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ఈ ప్రాజెక్టు నిధుల కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వ హయాంలోనే పనుల నిర్వహణకు టెండర్లు ప్రక్రియ పూర్తయ్యాయి. 2025 జూన్ 25 నాటికి పనులు పూర్తి కావాలని కాంట్రాక్టు సంస్థతో ఒప్పందం జరిగి రెండేళ్లు పైనే పూర్తయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చేస్తుండడంతో ప్రాజెక్ట్ పనులపై నీలినీడలు అలుముకున్నాయి.సురక్షిత నీటి కోసం అల్లాడుతున్న జనంఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల ప్రజలు నేటికీ తాగునీటి సమస్యను తీవ్రస్థాయిలో ఎదుర్కొంటున్నారు. గోదావరి పక్కనే ఉన్నా సురక్షిత తాగునీరు సక్రమంగా అందని పరిస్థితులు ఉన్నాయి. నేటికీ పలు ప్రాంతాల ప్రజలకు కలుషిత నీరే దిక్కవుతుంది. దీంతో అనేకమంది రోగాల భారిన పడుతున్నారు. ప్రభుత్వాలు తాగునీటి అవసరాల కోసం పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తున్నామని చెప్పుకుంటున్నప్పటికీ ఆచరణలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. దీంతో అనేకమంది గ్రామీణ ప్రాంత ప్రజలు సురక్షిత తాగునీటి కోసం అనేకేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు స్వచ్ఛ తాగునీరు అందుతుందని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. వేధిస్తున్న భూ సేకరణ భూ సేకరణ సమస్య వేధిస్తోంది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చేస్తుండడంతో ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందనేది నేటికీ స్పష్టత లేకుండా పోయింది. ఇప్పటికే అధికారులు సుమారు 650 కిలోమీటర్లు సర్వే పూర్తి చేశారు. జేగురుపాడులో 11 ఎకరాలు భూసేకరణ పూర్తి చేశారు. అయితే ప్రభుత్వం దీనికి బడ్జెట్ ను విడుదల చేయలేదు. వెలిచేరు గ్రామం వద్ద 10 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. ఇవన్నీ జరగాలంటే తొలుత ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి. అప్పుడే ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంటుంది.