ఉప్పాడ బీచ్‌లో అలల ఉధృతి

May 25,2024 22:16
ఉప్పాడ బీచ్‌లో అలల ఉధృతి

శిథిల వంతెనలతో ఆందోళన ప్రజాశక్తి-యు.కొత్తపల్లిబంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో ఉప్పాడ కాకినాడ బీచ్‌ రోడ్డులో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. శనివారం ఉదయం నుంచి సముద్రపు అలలు తీవ్ర స్థాయిలో ఉండడంతో బీచ్‌ రోడ్డుకు గోడగా వేసిన రక్షణ రాళ్లు రోడ్డుపైకి చేరుకోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. అలల ఉధతికి బీచ్‌ రోడ్డులో ఉన్న పాత వంతెన ఏ సమయాన కూలుతుందో అని పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. ఈ వంతెన వద్ద నుంచుని సాగర తీర అందాలను పర్యాటకులు వీక్షిస్తుంటారు. సుబ్బంపేట నుంచి ఎస్‌పిజిఎల్‌ శివారు వరకు అలలు బీచ్‌ రోడ్డు పైకి చేరుతున్నాయి. ఎస్‌పిజిఎల్‌ సమీపం వద్ద ఉన్న వంతెన పైనుండి కెరటాలు వెళ్లడంతో అటుగా వెళ్లే వాహనదారులు భయబ్రాంతులకు గురవుతున్నారు. వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా మారుతుందన్న అధికారుల సమాచారంతో తీర ప్రాంత గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కోనపాపపేట, సూరాడపేట ఉప్పాడ గ్రామ మత్స్యకారులు కొంతమంది సముద్రానికి అతి దగ్గరలో ఉండి జీవిస్తున్నారు. వారిని అధికారులు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మత్స్యకార పెద్దలు కోరుతున్నారు. కోనపాపపేట నుండి కాకినాడ లైట్‌ హౌస్‌ వరకు సుమారు 6 వంతెనలు ఉన్నాయి. ప్రతి వంతెనకూ ఇరువైపులా గోడలు కూలిపోయి శిథిలావస్థకు చేరుకోవడంతో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో విజంభిస్తున్న అలలకు వంతెనలు ప్రమాదంలో ఉన్నాయని కనీసం అధికారులు వంతెనలను పట్టించుకున్న దాఖలాలు లేవంటున్నారు. వంతెలనలు ఎప్పుడు కూలిపోతాయో అని బిక్కుబిక్కుమని ప్రయాణాలు సాగించాల్సి వస్తోందని వాహనదారులు తెలుపుతున్నారు. కనీసం వంతెనల వద్ద అధికారులు హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వచ్చేది వర్షాకాలం కాబట్టి మరెన్నో విపత్తులు వచ్చే సందర్భాలు ఉన్నాయి.

➡️